పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఈ నెల 13లోపు పూర్తిచేయాలి అత్యవసర పరిస్థితులు మినహా సచివాలయ ఉద్యోగులను సెలవు దినాల్లో పిలవరాదు ఉద్యోగ సంఘాలతో జాయింట్ కౌన్సిల్ సమావేశంలో నేతలు
ఒంగోలు సబర్బన్: ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఆధారంగా మాత్రమే టార్గెట్లు నిర్ణయించడం వలన ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని, ఫీల్డ్ స్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని జిల్లా అధికారుల దృష్టికి ఉద్యోగ సంఘాల నేతలు తీసుకెళ్లారు. స్థానిక ప్రకాశం భవన్‌లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం జాయింట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) పి.వెంకట రమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సేవ, సంక్షేమం, పరిపాలనా సంబంధిత అంశాలు, పలు ముఖ్య సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలియజేశారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన ప్రధాన అంశాలు...
జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను 13–07–2026లోపు పూర్తి చేయాలి. సచివాలయ ఉద్యోగులను అత్యవసర పరిస్థితులు మినహా ప్రభుత్వ సెలవు దినాల్లో విధులకు పిలవకూడదు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్ల పరిష్కారానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి. మహిళా ఉద్యోగులను సాయంత్రం 6 గంటల తర్వాత విధుల్లో కొనసాగించకుండా తగిన ఆదేశాలివ్వాలి. ఒంగోలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో క్రెచ్ సదుపాయం ఏర్పాటు చేయాలి. ప్రకాశం భవన్, జీజీహెచ్, పాత రిమ్స్, తదితర కార్యాలయాల్లో శౌచాలయాల నిర్వహణ, పరిశుభ్రత మెరుగుపరచాలి. ఐపీహెచ్‌ఎస్–2022 నిబంధనల ప్రకారం 247 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 4వ స్టాఫ్ నర్స్ పోస్టులు మంజూరు చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. అదేవిధంగా బీఎల్‌ఓ విధులకు సంబంధించి సస్పెన్షనన్‌కు గురైన కొంతమంది ఉద్యోగుల సమస్యలను కూడా ఉద్యోగ సంఘాలు సమావేశంలో ప్రస్తావించాయి. సంబంధిత ఉద్యోగులపై జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను విచారణ పూర్తయ్యే వరకు నిలిపివేసి మానవతా దృక్పథంతో పునరాలోచించి వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సమావేశంలో చర్చించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణ హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా పరిపాలనా అధికారి సాయి శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది, ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్ బాబు, కార్యదర్శి ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్‌రెడ్డి, కార్యదర్శి వరకుమార్, పలు సంఘాల నేతలు పొల్గొన్నారు.
డీఆర్‌ఓకు పలు ఉద్యోగ సంఘాల నేతల అర్జీలు...
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణకు పలు ఉద్యోగ సంఘాల నేతలు గురువారం ప్రకాశం భవనంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం వినతిపత్రాలు అందించారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి వరకుమార్, సహాధ్యక్షుడు మసూద్ అలీ, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావులు కలిసి ఉద్యోగుల సమస్యలపై అర్జీలిచ్చారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్‌టీయూ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్, తదితరులు అర్జీ అందించారు.


