ఒంగోలు సబర్బన్: నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం జరుగుతున్న తీరుపై కలెక్టర్ పి.రాజాబాబు అసహనం వ్యక్తం చేశారు. కొందరు బీఎల్‌ఓలు, ఏబీఎల్‌ఓల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని గాంధీనగర్ వద్ద ఉన్న వార్డు సచివాలయాన్ని గురువారం ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు చేస్తున్న ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈఆర్‌ఓలు ఎంతమంది ఉన్నారని వివరాలడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో అలసత్వం వహిస్తున్న బీఎల్‌ఓ, అడిషనల్ బీఎల్‌ఓ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. వారి స్థానంలో వేరే వారిని నియమించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మొబైల్ యాప్ ద్వారా ఓటరు నమోదు ప్రక్రియ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సవరణ ప్రక్రియను త్వరితగతిన, కచ్చితత్వంతో, సమర్థవంతంగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ ఒక్కరూ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మిగిలిపోకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లందరి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పలు సచివాలయాలను తనిఖీ చేసిన జేసీ...
జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గురువారం ఒంగోలు నగరంలోని పలు సచివాలయాలను తనిఖీ చేశారు. తొలుత వెంకటేశ్వరకాలనీలో పర్యటించారు. అనంతరం గద్దలకుంట–2 సచివాలయాన్ని సందర్శించారు. ఆయా సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాల డిజిటైజేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు ఉన్నారు.
కొందరు బీఎల్‌ఓలు, ఏబీఎల్‌ఓల పనితీరు సక్రమంగా లేదంటూ ఆగ్రహం
ఒంగోలు నగరంలోని పలు సచివాలయాల ఆకస్మిక తనిఖీ


