అన్ని బ్యాంకుల ఖాతాదారులకు తప్పనిసరి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ వెంకట రమణారావు
ఒంగోలు సబర్బన్: బ్యాంకు ఖాతాదారులందరూ వారి ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ) వివరాలను వెంటనే నవీకరించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ జి.వెంకట రమణారావు కోరారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్గదర్శకాల మేరకు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడు దీనిని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. స్థానిక బ్యాంకు ఆర్‌ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీని సులభంగా పూర్తిచేసుకోవచ్చన్నారు. అలాగే, సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సందర్శించి కూడా ఈకేవైసీ వివరాలను నవీకరించుకోవచ్చని తెలిపారు. ఈకేవైసీని సకాలంలో పూర్తి చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయన్నారు. అలాగే ఖాతాల భద్రత మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇంకా కేవైసీ పూర్తి చేయని ఖాతాదారులు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. బ్యాంకు శాఖ, కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చని చెప్పారు. ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకు అన్ని శాఖల్లో ఈకేవైసీ ప్రక్రియను సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని ఆయన కోరారు.


