● మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తాం, లక్షల ఉద్యోగాలిస్తాం, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వైఎస్ జగన్ హయాంలో సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల కోసం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారన్నారు. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణలు చూస్తే మెడికల్ కాలేజీలు, కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, బీమా సేవలు.. ఇలా ప్రతీ చోటా ఇదే తంతు అని గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు కృష్ణార్పణం అయిపోతోందన్నారు. 850 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 5 వేల కోట్లతో నిర్మించిన రామాయపట్నం పోర్టును సైతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఈ పోర్టు పనులు 95 శాతం పూర్తయ్యాయన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు ఇలా ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి లీజులపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల సంగతి ఏమైందో అందరూ చూశారని.. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.
ఒంగోలు సబర్బన్: జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఇన్‌టిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఐసీడీఎస్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా పద్మ సునంద గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబును ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు.
మార్కాపురం: తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ముత్తోజు సుధాకర్‌ను మార్కాపురం డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ (డీసీఈబీ)గా నియమిస్తూ మార్కాపురం జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా, సింగపూర్ విద్యా విధానాలను నిశితంగా పరిశీలించిన వ్యక్తిగా గుర్తింపు పొందడంతో పాటు నైపుణ్య అభివృద్ధిపై ప్రభుత్వానికి సుధాకర్ నివేదిక సమర్పించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సైన్సు ఫెయిర్‌లో పాల్గొ ని బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ, విద్యార్థులు మెరుగైన ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తానని అన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్ కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి సీహెచ్‌వీ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువర్గాల అంగీకారంతో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి వేదికని అన్నారు. ఇలా పరిష్కరించుకోవడం అనేది ఇరువర్గాలు గెలిచినట్టేనని తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లలో రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులు, మోటార్ సంబంధ వ్యాజ్యాలు, వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా సివిల్ కేసుల్లో న్యాయస్థానాల్లో చెల్లించిన ఫీజులు తిరిగి పొందవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సత్యానంద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో 27 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.


