ఎస్‌జీఎఫ్ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
మార్కాపురం: మార్కాపురం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) సెక్రటరీ నియామకం కోసం వ్యాయామ ఉపాధ్యాయులు (పురుషులు/మహిళల) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సుబ్బారావు తెలిపారు. అండర్ – 14, 17 స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టుకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు వ్యక్తిగత వివరాలను, ప్రతిభా ఫలితాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
● గర్భిణులకు రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సూచన
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కిల్కారీ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని కిల్కారీ రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సూచించారు. నగరంలోని పాపాకాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ రాజేశ్వరితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గర్భధారణ అనంతరం నాలుగో నెల నుంచి శిశువుకు ఒక సంవత్సరం వచ్చేంత వరకు ప్రతి నెలా కిల్కారీ వాయిస్ వస్తుందని తెలిపారు. ఈ కాల్స్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, ఏఎన్‌సీ పరీక్షలు, ప్రసవ ప్రణాళిక, తల్లి పాల ప్రాముఖ్యత, నవజాత శిశువు సంరక్షణ, డయేరియా, న్యూమోనియా నివారణ, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి సలహాలు, సూచనలు చేశారు. ప్రతి గర్భిణీ, బాలింతలు కిల్కారీ నంబర్ 911600403660 నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ యామిని, వైద్య సిబ్బంది, గర్భిణులు పాల్గొన్నారు.


