ఉమ్మడి జిల్లాలో
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. త్రిపురాంతకం, మర్రిపూడి, కొనకనమిట్ల, బల్లికురవ, చీమకుర్తి, సంతనూతలపాడు, గిద్దలూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మార్చిలో 38 డిగ్రీలకు సెల్సియస్‌కు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
పిడుగుపాటు, ఈదురుగాలులు...
వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులతో బుధవారం రాత్రి నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. కనిగిరి ప్రాంతంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందాయి. దర్శి ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
త్రిపురాంతకం: అకాల వర్షాలకు మండలంలోని సోమేపల్లి గ్రామానికి చెందిన దూళ్ల గాలెయ్య, ఎం కోటేశ్వరరావు. డి.ఆంజనేయులకు చెందిన 8 ఎకరాల్లో అరటి చెట్లు పూర్తిగా విరిగిపడ్డాయి. దీంతో సుమారు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు సమీపంలోని పొలాల్లో తాటి చెట్టు గుబురుపై బుధవారం రాత్రి పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. అయితే అప్పటి వరకు ఆ పక్కనే ఉన్న మిరప తోటల్లో కూలీలు ఇంటికి రావడంతో ప్రమాదం తప్పింది.
పొదిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఓ మోస్త్తరు వర్షం కురిసింది. ఈగలపాడు, పాములపాడు, జువ్వలేరు, కుంచేపల్లి గ్రామాల్లో 20 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రైతులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో గాలులతో వడగండ్లు పడ్డాయి. జువ్వలేరులో బొప్పాయి తోటలకు కొంత మేర నష్టం వాటిల్లింది.


