ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పి. రాజాబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ ఈ నెల 17వ తేదీతో ముగియడంతో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ ప్రతిష్టతను పెంచడంతో పాటు నగర పౌరులకు మెరుగైన సేవలందేలా కృషి చేస్తామన్నారు. అమృత్ పథకం కింద ఒంగోలు నగరంలో రూ.450 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ పనులు ఏడాది కాలంలో పూర్తి చేస్తే నగర ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. నగర అభివృద్ధితో పాటు రెవెన్యూ రాబడిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌ఓ వైష్ణవి, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు.


