అంత్యక్రియలు చేయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలు చేయొద్దు..

Mar 20 2026 7:54 AM | Updated on Mar 20 2026 7:54 AM

పురాతన కాలం నాటి శ్మశాన వాటికలో అంత్యక్రియలు అడ్డుకున్న అధికారులు మృతదేహంతో 4 గంటల పాటు నిరసనకు దిగిన వాల్మీకి బోయకులస్తులు వాల్మీకి బోయకులస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం

అది ప్రైవేట్‌ స్థలం..

కనిగిరిరూరల్‌: ప్రైవేట్‌ స్థలంలో అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుకోవడంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన మార్కాపురం జిల్లా కనిగిరిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 9వ వార్డుకు చెందిన చొప్పరపు అంజమ్మ(70) గురువారం మృతి చెందింది. అంజమ్మకు ఖనన, అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్మీకి బోయకులస్తులంతా పురాతన కాలం నాటి శ్మశాన వాటిక వద్దకు తీసువెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అది ప్రైవేట్‌ స్థలమని, అక్కడ అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే తాతల కాలం నుంచి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుకోవడానికి మీరెవరంటూ వాల్మీకి బోయకులస్తులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 4 గంటల పాటు వాల్మీకి బోయ కులస్తులు మృతదేహంతో నిరసనకు దిగారు. ప్రభుత్వ, అధికారుల తీరుపై వాల్మీకి బోయకులస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు అంజమ్మ అంత్యక్రియలు జరిగాయి.

వాల్మీకి బోయ కులస్తులేమంటున్నారంటే..

‘మా తాత ముత్తాల కాలం నాటి నుంచి సర్వే నెంబర్‌ 554లోని భూమిలో వాల్మీకి బోయ కులస్తుల శ్మశాన వాటిక ఉంది. ఆ సర్వే నెంబర్‌లోని సుమారు 5 ఎకరాల భూమిలో దాదాపు 50 సెంట్ల స్థలంలో ఎప్పటినుంచో అంత్యక్రియల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ధరలు పెరగడంతో కొందరు రియల్‌ వ్యాపారులు అధికార పార్టీ నేతల అండతో ఆ భూమిలో అడుగు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని’ వాపోయారు. ఇప్పటికే మాపై కేసులు పెట్టారని, శ్మశానాన్ని రాత్రికి రాత్రి పెకలించారని, ఇటీవల శ్మశాన వాటికను చదును చేసేందుకు ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. అందుకు వ్యతిరేకంగా గతంలో నిరసన ర్యాలీలు కూడా చేశామని వివరించారు. శ్మశాన వాటిక ఉన్న స్థలం సుమారు రూ.2 కోట్లపైనే పలుకుతుండటంతో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకే రియల్‌ వ్యాపారులు అధికార పార్టీ అండతో తమ పై దౌర్జన్యం చేస్తున్నారని వాల్మీకి బోయ కులస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా వారికి మద్దతుగా ఉన్నారని వాపోయారు. శ్మశాన వాటిక భూమి మట్టిని ల్యాబ్‌ పరీక్షలు నిర్వహస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని, వందల ఏళ్ల నుంచి అక్కడ శ్మశాన వాటిక ఉందని వాల్మీకి బోయకులస్తులు వాపోతున్నారు.

అధికారులు ఇలా..

అయితే అధికారులు మాత్రం శ్మశాన వాటిక స్థలం ప్రైవేటు వ్యక్తుల భూమిగా, రిజిస్టర్‌ ల్యాండ్‌గా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక స్థలం కాకుండా.. మరో రెండు మూడు చోట్ల ప్రదేశాలు చూపిస్తున్నారు. కానీ వాల్మీకి బోయకులస్తులు దానికి అంగీకరించడం లేదు. పూర్వీకుల కాలం నాటి శ్మశాన వాటికలో తాము అంత్యక్రియలు చేస్తామని తెగేసి చెప్తున్నారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం.. బాధిత వాల్మీకి బోయకులస్తులతో మాట్లాడుతున్నామని.. సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement