శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 20 2026 7:54 AM | Updated on Mar 20 2026 7:54 AM

శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026 – 8లో.. తెరుచుకున్న నల్లబజారు తలుపులు

మాముళ్ల మత్తులో అధికారులు...

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లాలో గ్యాస్‌ కష్టాలు యుద్ధం ప్రారంభం నుంచే పక్కదారి పట్టిన గ్యాస్‌ అక్రమార్కులతో కుమ్మకై ్కన ఏజెన్సీ నిర్వాహకులు బ్లాక్‌లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 3000 నుంచి రూ.3600 రూ.5000కు పైగానే కమర్షియల్‌ సిలిండర్‌ మూతపడుతున్న హోటళ్లు, కర్రీ పాయింట్లు, టీ స్టాళ్లు గ్యాస్‌ కొరత లేదని ప్రకటించి చేతులు దులుపుకున్న అధికారులు క్షేత్రస్థాయిలో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలు

రోడ్డున పడుతున్న హోటల్‌ వర్కర్లు...

పశ్చిమాసియా యుద్ధం సెగ మన వంటింటిని తాకింది. గ్యాస్‌ కంపెనీ ఏజెన్సీలు, అధికారులతో కుమ్మకై ్క చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గ్యాస్‌ కొరతను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్‌ సిలిండర్లను నల్లబజారుకు తరలించి డొమెస్టిక్‌ సిలిండర్‌ రూ. 3600, కమర్షియల్‌ సిలిండర్‌ రూ. 5000 వరకూ విక్రయిస్తున్నారని సమాచారం. బ్లాక్‌లో సిలిండర్లను కొనలేక ఇటు ప్రజలు, అటు వ్యాపారస్తులు అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో పలు చోట్ల హోటళ్లు, కర్రీ పాయింట్స్‌ మూతపడ్డాయి. ఇడ్లీ, దోశలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న మధ్య తరగతి, చిరువ్యాపారుల ఉపాధికి గండి పడుతోంది. అధికారులు మాత్రం గ్యాస్‌ కొరత లేదంటూ ప్రకటనలు చేయడం గమనార్హం.

యుద్ధం మొదలైన రోజు నుంచే 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను ఏజెన్సీలు నిలిపివేసినట్లు హోటల్‌ యజమానులు చెబుతున్నారు. ఏజెన్సీలు కమర్షియల్‌ గ్యాస్‌ లేదని చేతులెత్తేశారు. అదే సమయంలో నల్లబజారు తలుపులు తెరుచుకున్నాయి. బ్లాక్‌ మార్కెట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సిలిండర్లు లభ్యమవుతున్నాయి. యుద్ధానికి ముందు వరకు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1982 ఉండగా యుద్ధం మొదలయ్యాక కేంద్రం రూ.115 పెంచడంతో ప్రస్తుతం రూ. 2.097లకు చేరుకుంది. అయితే ఏజెన్సీలు కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా చేయకపోవడంతో నల్లబజారులో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రూ.4500 నుంచి రూ. 5000కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యాస్‌ మాటలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో మూడు స్టార్‌ హోటళ్లతో పాటుగా 16 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. 150 నుంచి 200 బడా హోటళ్లున్నాయి. ఇవి కాకుండా వీధి వీధికొకటి చొప్పున వెలిసిన చిన్న చిన్న హోటళ్లు మరో 1000కి పైగానే వున్నాయి. ఇళ్ల దగ్గర ఇడ్లీ, దోశలు వేసి అమ్ముకునే వాళ్లు మరో 500 మంది వరకు ఉన్నారు. 1200 నుంచి 1500 టీ స్టాల్స్‌ ఉన్నాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద న్యూడిల్స్‌ పాయింట్లు, చికెన్‌ పకోడి బండ్లు సుమారు 200 పైమాటే. ఇక కేటరింగ్‌లకు లెక్కలేదు. ఒక్కో స్టార్‌ హోటల్‌లో రోజుకు 10కి పైగానే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తుంటారు. రెస్టారెంట్లలో నిత్యం 6 నుంచి 8 గ్యాస్‌ సిలిండర్లు పనిచేస్తూనే ఉంటాయి. రోజుకు సుమారు 10,200కు పైగానే గ్యాస్‌ సిలిండర్లు అవసరం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 10 వేలకు పైగానే గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. అయితే ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాలుగు రోజల తర్వాత గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు కావలసినప్పుడల్లా లభించే గ్యాస్‌ సిలిండర్లను రాత్రికి రాత్రే నల్లబజారుకు తరలించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృత్రిమ గ్యాస్‌ కొరత సృష్టించి అడ్డగోలు సంపాదనకు తెరదీశారని మండిపడుతున్నారు.

వంటింకి మంట..

ప్రకాశం జిల్లాలో 5,51,759, మార్కాపురం జిల్లాలో 3,22,279 గృహ వినియోగదారులు ఉన్నాయి. ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు 9,875 సిలిండర్లు అవసరం ఉండగా డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు సిద్ధం ఉన్నట్లు కలెక్టర్‌ పి.రాజాబాబు ప్రకటించారు. జిల్లాలో వంట గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు, మార్కాపురంతో పాటుగా అనేక మండల కేంద్రాల్లో డొమోస్టిక్‌ గ్యాస్‌ సక్రమంగా లభించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటల్‌ నిర్వాహకులు అనివార్యంగా డొమెస్టిక్‌ గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నల్లబజారు వ్యాపారస్తులు గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆమాంతం పెంచేసి నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. డొమెస్టిక్‌ గ్యాస్‌ ఽసిలిండర్‌ రూ. 958కి ప్రభుత్వం సరఫరా చేస్తోంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రూ. 1500లకు విక్రయించారు. ఆ తరువాత క్రమంగా పెంచుకుంటూ పోయిన అక్రమార్కులు గురువారం నాటికి ఒక్కో సిలిండర్‌ను రూ. 3000 నుంచి రూ.3600 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే సిలిండర్‌ ధర రూ.5000 వరకు పెరిగినా అశ్చర్యం లేదని చెబుతున్నారు. నగరంలోని సంతపేట సాయిబాబా ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఏటా అన్నదానం నిర్వహిస్తారు. గ్యాస్‌ కొరత తో ఈ ఏడాది అన్నదానం చేయడం లేదని ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా బోర్డు పెట్టడం గమనార్హం.

మూతపడుతున్న హోటళ్లు...

జిల్లా కేంద్రంలోని హోటళ్లపై యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక రెస్టారెంట్లు, హోటళ్లలో న్యూడిల్స్‌, పుల్కా, పూరి, ఇడ్లీ, స్టాటర్స్‌, చికెన్‌ స్నాక్స్‌లను పూర్తిగా ఆపివేశారు. వెజిటేరియన్‌ హోటళ్లలో కూడా వేపుళ్లను నిలిపివేశారు. పప్పు, సాంబరు, చారుతో సరిపెడుతున్నారు. ఊక పొయ్యి మీద వండే వాటిని మాత్రమే వడ్డిస్తున్నట్లు హోటల్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్లో పలు హోటళ్లు ఊక పొయ్యిని వినియోగిస్తున్నట్లు తెలిసింది. గ్యాస్‌ కొరతతో నగరంలో రోజుకో హోటల్‌ మూతపడుతోంది. నెల్లూరు బస్టాండు సెంటర్లో ఇటీవలే ప్రారంభించిన కొత్త హోటల్‌కు తాళం వేశారు. ముంగమూరు డొంకకు వెళ్లే దారిలో ఒక హోటల్‌ మూడు రోజులుగా తెరవడం లేదు. ఇక పూర్తిగా గ్యాస్‌ సిలిండర్ల మీదనే ఆధారపడిన టీ స్టాళ్లు చాలా వరకు మూతపడుతున్నాయి. కొన్ని టీ స్టాల్స్‌లో రూ. 5వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు రూ.10 విక్రయించిన టీ ఇప్పుడు రూ.15 పెంచారు. కాఫీ ధరలను సైతం రూ.30 లకు పెంచినట్లు చెబుతున్నారు. నగరంలోని పాత కూరగాయల మార్కెట్‌ వద్ద ప్రముఖ టీ స్టాల్‌ నాలుగు రోజులుగా తలుపులు తెరవడం లేదు. కేటరింగ్‌లు, ఇళ్ల వద్ద నిర్వహించే టిఫిన్‌ పాయింట్లలో ఇడ్లీ, దోశ ధరలను పెంచేశారు.

నగరంలో నల్ల బజారు వ్యాపారులను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోని అధికారులు డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసులు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీలు నల్లబజారు వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు నల్ల బజారు వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

యుద్ధం హోటల్‌ వర్కర్ల పొట్టకొడుతోంది. నగరంలోని పలు హోటళ్లు మూతపడుతుండడంతో అనేక మంది హోటల్‌ వర్కర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. రెస్టారెంట్లు, బడా హోటళ్లలో కనీసం 100 వరకు పని చేస్తుంటారు. రోజువారి కూలీతో వంట మాస్టర్లు, సప్లయర్లు, క్లీనింగ్‌ స్టాఫ్‌ పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇప్పుడు వీరంతా ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అటు ప్రభుత్వ సాయం లేదు. ఇటు హోటల్‌ యాజమాన్యాలు అందించే చేయూతలేక అర్ధాకలితో జీవిస్తున్నామని వాపోతున్నారు. మాయదారి యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది. తిరిగి మాములు పరిస్థితులు ఎప్పుడు వస్థాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement