బొల్లావులతో చిందులు.. కాటమరాజుకు మొక్కులు | - | Sakshi
Sakshi News home page

బొల్లావులతో చిందులు.. కాటమరాజుకు మొక్కులు

Mar 19 2026 7:31 AM | Updated on Mar 19 2026 7:31 AM

పెద్దారవీడు: నల్లమల అభయారణ్యంలో పెద్దారవీడు మండల పరిధిలోని గుండంచర్ల సమీపంలో వెలసిన వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవాని అమ్మవార్ల తిరునాళ్ల బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలు, పూలమాలతో శోభాయమానంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అన్న సంతర్పణ చేశారు. తిరునాళ్ల సందర్భంగా రాత్రి వేళ భక్తుల కాలక్షేపానికి విద్యుత్‌ ప్రభలు, కోలాటం, నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

భక్తిపారవశ్యం.. బొల్లావుల ఉత్సవం

కాటమరాజు స్వామి తిరునాళ్ల సందర్భంగా బొల్లావుల ఉత్సవం భక్తులను ఆనందపరవశులను చేసింది. కనక తప్పెట్ల మోత, కొమ్ము బూర వాయిద్యం నడుమ యాదవులు వీరతాళ్లతో బొల్లావులను ఆడిస్తుండగా స్వామి వారి ఆలయం చుట్టూ మహిళలు పొంగళ్లతో ప్రదక్షిణలు చేశారు. మొక్కుబడి ఉన్న మహిళలు గంగాభవానీ అమ్మవారికి పట్టుచీరలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఊరేగింపుగా వచ్చిన బొల్లావులు కాటమరాజు సన్నిధిలో కొలువుదీరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement