కూటమిలో కుంపటి | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుంపటి

Mar 12 2026 7:12 AM | Updated on Mar 12 2026 7:12 AM

కౌన్సిల్‌లో అధికార కూటమి సభ్యుల మధ్య రచ్చ జనసేన సభ్యుల సమస్యలను పరిగణలోకి తీసుకోవటం లేదని తిరుగుబాటు మైకులు విరగ్గొట్టే స్థాయికి చేరిన జనసేన సభ్యుల తీరు టీడీపీ సభ్యుల చర్యలకు నిరసనగా జనసేన సభ్యుల బాయ్‌కాట్‌ నగరంలో సమస్యలపై ఏకరువు పెట్టిన వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌

ఒంగోలు సబర్బన్‌: అధికార కూటమి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకున్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో అధికార టీడీపీ, జనసేన సభ్యుల మధ్య మాటల తూటాలు రచ్చకు దారితీశాయి. చివరకు జనసేన సభ్యులు మైకులు విరగ్గొట్టే స్థాయికి చేరుకున్నారు. కొంతసేపు కౌన్సిల్‌ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్‌ సుజాత లేకపోవటంతో డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన బుధవారం కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్‌ హాలులో కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. కౌన్సిల్‌కు ఈ నెల 16వ తేదీతో పాలక మండలి గడువు ముగుస్తుండటంతో చివరగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 41 అంశాలతో కూడిన అజెండాతో కౌన్సిల్‌ను ప్రారంభించిన వేమూరి 38వ అంశం వచ్చేసరికి కౌన్సిల్‌ ఒక్కసారిగా వేడెక్కింది. 38వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్‌ మలగా రమేష్‌ తన డివిజన్‌లో ఉన్న పార్కుకు శ్రీకృష్ణ దేవరాయ పార్కుగా నామకరణం చేయాలనే అంశాన్ని కౌన్సిల్‌లో ఆమోదం కోసం పెట్టారు. అయితే ఆ అంశం ప్రస్తావనకు రాగానే టీడీపీ సభ్యుడు తేజ లేచి ఆ అంశాన్ని వాయిదా వేయాలని చెప్పాడు. దాంతో రచ్చ ప్రారంభమైంది. స్థానికంగా ప్రజల అభిప్రాయాలతో సంతకాల సేకరణ చేపట్టామని, మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పటానికి నువ్వెవరంటూ టీడీపీ సభ్యుడు తేజను జనసేన సభ్యుడు మలగా రమేష్‌ నిలదీశాడు. దాంతో అటు టీడీపీ సభ్యులు, ఇటు జనసేన సభ్యులు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. కౌన్సిల్‌లో జనసేనకు 21 మంది సభ్యుల బలం ఉంది. దాంతో కౌన్సిల్‌ ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు జనసేన సభ్యుడు మలగా రమేష్‌ మైక్‌ ఎత్తి నేలకేసి కొట్టాడు. దాంతో కౌన్సిల్‌లో ఇంకా రెండు గ్రూపుల మధ్య వాడి వేడి మాటల యుద్దం జరిగింది. చివరకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కలుగజేసుకొని ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నామే కానీ రద్దు చేయటం లేదని చెప్పటంతో కొంత శాంతించారు. చివరకు జనసేన సభ్యులు టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా బాయ్‌ కాట్‌ చేస్తున్నామంటూ కౌన్సిల్‌ హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు.

రెండేళ్లలో జీరో అవర్‌ ప్రవేశపెట్టలేదు...వైఎస్సార్‌ సీపీ ధ్వజం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుందని, అయితే ఈ రెండేళ్లలో ఒంగోలు నగర ప్రజల సమస్యలను చర్చించటానికి అవకాశం కల్పించే ‘‘జీరో’’ అవర్‌ను ప్రవేశపెట్టలేదని వైఎస్సార్‌ సీపీ సభ్యులు పాలక పార్టీలపై ధ్వజమెత్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కౌన్సిల్‌ తీరును తూర్పారబట్టారు. పాలక మండలి కాలపరిమితి పూర్తి కావస్తున్నా కనీసం చివరి సమావేశంలోనైనా జీరో అవర్‌ను ప్రవేశ పెట్టక పోవటాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా పరిగణించారు. అజెండాలోని అంశాలను ఆమోదింపజేసుకునే ఆలోచనలోనే పాలక పార్టీ సభ్యులు ఉన్నారే తప్ప ప్రజల సమస్యలను ప్రస్తావిద్దామన్న ఆలోచనే లేదన్నారు. ఒంగోలు నగరంలో విపరీతమైన దోమలతో ప్రజలు అల్లాడుతుంటే అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. నాలుగైదు దఫాలుగా మంచినీరు సక్రమంగా రావటంలేదన్నారు. వేసవి రాకముందే మంచినీటి కొరత ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహకు అందటం లేదని ఇమ్రాన్‌ ఖాన్‌ ధ్వజమెత్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ దివాలా తీసిందన్నారు. ‘‘ట్రేడ్స్‌ రిసీవబుల్‌ డిస్కౌంటింగ్‌ సిస్టం’’ (ట్రెడ్స్‌) ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటమేంటని ప్రశ్నించారు. అసలు నగర పాలక సంస్థలో ఎన్ని కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు ఉన్నాయో చెప్పాలన్నారు. దాంతో టీడీపీ సభ్యులు వైఎస్సార్‌ సీపీ సభ్యులను అడ్డుకున్నారు. మాట్లాడనీయకుండా గొడవకు దిగారు. ఒంగోలు నగరంలోని ఎస్‌ఎస్‌ ట్యాంకుకు పడమర వైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని స్ట్రీట్‌ వెండార్స్‌ కోసం తలపెట్టిన స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ మార్కెట్‌ ఏర్పాటు సక్రమ పద్ధతిలో చేపట్టటం లేదని జనసేన నాయకుడు, డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు నిలదీశారు. రూ.50 లక్షలకు పైగా ఖర్చుచేయాలని చూడటం అనాలోచిత చర్య అని అధికారులపై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement