ఒంగోలు టౌన్: వైద్య విద్యలో పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలని డాక్టర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం సందర్శించిన ఆయన అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. కీలకమైన అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యత ఉందని, దీని కోసం ప్రతి సంవత్సరం రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ప్రజారోగ్యం, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజారంగంలో పరిశోధనలను విస్తరించేందుకు సింగపూర్ యూనివర్శిటీ, గేట్స్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కళాశాల విద్యతోపాటుగా క్రీడలు, ఇతర సామాజిక అంశాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి, నిరాశ లేకుండా సైకాలజీ విభాగం సరైన కౌన్సిలింగ్ అందించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏసుపాదం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.మాణిక్యరావు, డా.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


