ఒక్క హామీ పూర్తిగా అమలు చేయని చరిత్ర హీనుడుగా చంద్రబాబు అభివృద్ధి మరిచి డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
హామీలన్నీ అమలు చేసిన ఏకై క సీఎం జగన్
దర్శి: దేశ చరిత్రలో వంద శాతం హామీలు అమలు చేసి చరిత్ర తిరగరాసిన ఒకే ఒక్క సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. దర్శి పట్టణంలో సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా కోలాట ప్రదర్శన వద్ద అందరితో కలసి కోలాటంలో సందడి చేశారు. అనంతరం కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్దకు వచ్చిన బూచేపల్లిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయని చరిత్రహీనుడుగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని అడిగితే చంద్రబాబు కల్తీ లడ్డు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే మీ పొట్టలు నింపుకోవడం కాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కపింఛన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భయపడటం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన పట్టిన జెండా విడవకుండా మా నాయకుడు జగనన్నే అని సగర్వంగా చెప్పుకుంటున్నారని స్పష్ట చేశారు.
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడేళ్ల నుంచి విద్యార్థులు లేక వివిధ పాఠశాలల్లో వారానికి, నెలకు రకరకాలుగా ఎయిడెడ్ ఉపాధ్యాయులను రోజువారి కూలీలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కోర్టుకు వెళ్లిన యాజమాన్యాల పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపుతున్నారు కానీ ఆ పాఠశాల యాజమాన్యాలు వారిని విధుల్లో చేర్చుకోవడం లేదన్నారు. జిల్లాలో మండలాల వారీగా జీవో నంబర్ వన్ ప్రకారం 165 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సబ్జెక్టు వారీగా సెకండ్ గ్రేడ్ టీచర్లు 108 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం 8, సోషల్ 6, సైన్స్ 4, తెలుగు పండిట్ 6, హిందీ పండిట్ 5, క్రాఫ్ట్ డ్రాయింగ్ 3, పీఈటీ 5, నాన్ టీచింగ్ స్టాఫ్ 20 మంది చొప్పున ఉన్నారని తెలిపారు. జిల్లాలో 42 ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే టీచర్ తో బోధన జరుగుతోందన్నారు. కొన్ని పాఠశాలల్లో 40 మంది పైన విద్యార్థులు ఉన్నారని, వారికి రెండవ టీచర్‌ను కేటాయించి యాజమాన్యం విల్లింగ్ ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను ఇచ్చి మిగిలిన ఎయిడెడ్ ఉపాధ్యాయులను శాశ్వతంగా కౌన్సిలింగ్ నిర్వహించి జీవో నంబర్ 24 ప్రకారం ప్రభుత్వ పాఠశాలలోకి సర్దుబాటు చేయాలని కోరారు.


