మా చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కార్మిక నగర్‌లో పోలీసు బందోబస్తు మద్య ఫెన్సింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితులు
ఒంగోలు టౌన్: ‘‘మేము 17 ఏళ్లుగా కార్మిక నగర్లో కాపురం ఉంటున్నాం. 2016లో మాకు పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. కొంతమంది 2018లో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అయితేనే మాకు పట్టాలు ఇవ్వండి, ప్రైవేటు భూమి అయితే మేమే దండం పెట్టి వెళ్లిపోతామని చెబుతున్నాం. అయినా వినకుండా గత నెల 4వ తేదీ కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా మా ఇళ్లను రాత్రికి రాత్రి పడ గొట్టారు. 200 మంది ప్రైవేటు వ్యక్తులు, మూడు జేసీబీలు తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు పోలీసులతో వచ్చి బలవంతంగా ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇది అన్యాయం..మాకు న్యాయం చేయకపోతే మేము పెట్రోలు పోసుకొని తగలబెట్టుకొని చనిపోతాం. మా చావుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పాలకులు, అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని’’ కార్మిక నగర్ బాధితురాలు చెరుకూరి లక్ష్మి చెప్పారు. కార్మిక నగర్‌లో నిరుపేదల గృహాలను కూల్చిన ప్రైవేటు వ్యక్తులు బుధవారం పోలీసులతో వచ్చారు. కూల్చివేసిన నివాసాల వద్ద ఉంటున్న బాధితులను స్థలంలోంచి బయటకు రావాలని హెచ్చరించారు. స్థానికులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా స్థలం చుట్టూ బలవంతంగా ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు అడ్డుకున్నారు. ఫెన్సింగ్ వేయడం ఆపకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగారు. దాంతో వెంటనే మరికొంతమంది పోలీసులు రంగంలోకి దిగారు. స్థలాలు ఖాళీ చేయించారు. దీంతో బాధితులు పోలీసులతో వాదనకు దిగారు. మాకు నోటీసులు ఇవ్వకుండా ఎలా ఫెన్సింగు వేస్తారని బాధిత మహిళలు ప్రశ్నించారు. అప్పటికప్పుడు గత 14వ తేదీ నోటీసులు ఇచ్చినట్లు రెవెన్యూ సిబ్బంది ఒకరు మొబైల్ ఫోన్లో మెసేజ్ సృష్టించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓ జారీ చేసినట్లు చెబుతున్న ఉత్తర్వులను తీసుకోవాల్సిందిగా బాధితుల మీద పోలీసులు ఒత్తిడి చేశారు. ఉత్తర్వులు తీసుకోని బాధితుల మీద కేసులు పెడతామని బెదిరించారు. ఇది జరుగుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ నాయకులు హరిబాబు, జయచంద్ర నాయక్, శేషాద్రి రెడ్డిలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. బాధితుల కుటుంబాలతో మాట్లాడి సమస్యను జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతామని భరోసా ఇచ్చారు. ఒకవైపు రవిబాబు మాట్లాడుతుండగానే మరోవైపు పోలీసులు దగ్గరుండి మరీ ఫెన్సింగ్ వేయించారు. ఇది గమనించిన రవిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కానీ, నగర పాలక సంస్థ అధికారులు కానీ లేకుండా ఫెన్సింగ్ ఎలా వేస్తున్నారని రవిబాబు ప్రశ్నించినా సమాధానం లేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఫెన్సింగ్ వేయడం గమనార్హం. దీంతో బాధితులంతా రాత్రంతా రోడ్డు మీదనే గడిపారు. చిన్నపిల్లలతో కలిసి రోడ్డు పక్కనే భోజనాలు వండుకొన్నారు.
ప్రైవేటు స్థలం అయితే మేమే వెళ్లిపోతాం...
కార్మిక నగర్ స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బాధిత మహిళ చెరుకూరి లక్ష్మి ఆరోపించారు. ఇప్పటికే ఈ స్థలం విషయంలో కోర్టుకు వెళ్లామని, కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. స్థలం ఎవరిదో తేల్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రైవేటు స్థలం అయితే మేమే వెళ్లిపోతామని చెప్పినా స్థలాన్ని ఎందుకు సర్వే చేయడం లేదని ప్రశ్నించారు. దౌర్జన్యంగా, అక్రమంగా మా నివాసాలను కూల్చివేసిన వారికి అధికారులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మరో బాధితురాలు కామేపల్లి సీతమ్మ మాట్లాడుతూ కార్మిక నగర్ పేదలపై దౌర్జన్యం చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం పోయిందని చెప్పారు.
బాధితులతో మాట్లాడుతున్న చుండూరి రవిబాబు


