ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్‌కు చంద్ర గ్రహణం రైతులకు అందని సేవలు చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో 10 ల్యాబ్ భవనాల నిర్మాణాలు పూర్తి వినియోగంలోకి 8 ల్యాబ్‌లు ప్రస్తుతం సేవలందిస్తున్నవి మూడే వాటిల్లోనూ అరకొర సేవలు గదుల్లో మూలుగుతున్న పరీక్ష పరికరాలు
అద్దంకి: వ్యవసాయం దండగ కాకుండా పండుగలాగా సాగాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రైతులు, పశుపోషకులు, ఆక్వా రైతుల కోసం ఇంటిగ్రేడెట్ అగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 10 ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాణాలు ప్రారంభించగా అందులో 8 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ల్యాబ్‌కు రూ.62.70 లక్షలు కేటాయించింది. యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, సంతనూతలపాడు, గిద్దలూరు, అద్దంకిలలో ల్యాబ్‌లు వినియోగంలోకి వచ్చాయి. సింగరాయకొండలో మాత్రం వ్యవసాయ, పశుసంవర్ధక, ఆక్వా కలిపి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిబ్బంది కొరత సాకుగా చూపి అగ్రి, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల నిర్వీర్యానికి కుట్రలు చేస్తోంది. ఇందులో పనిచేస్తున్న వ్యవసాయశాఖకు చెందిన సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం కందుకూరు, దర్శి, గిద్దలూరులోని అగ్రి ల్యాబ్‌ల్లో అరకొరగా సేవలందుతున్నాయి. సింగరాయకొండ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లో కేవలం ఆక్వా రైతులకు మాత్రమే మొక్కుబడిగా సేవలందుతున్నాయి.
ఉపయోగాలు ఇవీ..
ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే రైతు సొంతంగా తయారు చేసుకున్న విత్తనం లేదా, కొనుగోలు చేసిన విత్తనాన్ని తీసుకెళ్లి ఉచితంగా మొలక పరీక్ష చేయించుకోవచ్చు. ఎరువుల నాణ్యతను తెలుసుకోవచ్చు. విత్తన పరీక్ష నివేదికను వారం నుంచి పది రోజుల్లోపు పొందవచ్చు. ఎరువుల నాణ్యతను రెండు మూడు రోజుల్లోనే పొందవచ్చు. రైతులకు అన్ని పరీక్షలు పూర్తిగా ఉచితం.
ప్రతి ల్యాబ్‌లో ఆటోమేషన్
నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావడంతోపాటు ఫలితాలు ఆటోమేటిగ్గా సిస్టంలో నమోదవుతాయి. ఏ ల్యాబ్ లో ఏ బ్యాచ్ శాంపిల్ ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది. రైతు షాపుకెళ్లినప్పుడు బ్యాచ్ నంబర్ చెక్ చేసుకుంటే చాలు నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. శాంపిల్ టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు.
నిధులు లేవు..భద్రత లేదు
భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ భవనం కిటికీలకు అద్దాలు మాత్రమే బిగించారు. గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. దాంతో అందులో విలువైన పరికరాలు ఉంచితే భద్రత ముప్పు ఏర్పడుతుందని పరికరాలు బిగించలేదు. కెమికల్స్ ఇవ్వలేదు.
– ఏడీఏ ఎఫ్రాయిమ్
నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులు
అద్దంకి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ల్యాబ్ నిర్మాణానికి రూ.62.70 లక్షలు కేటాయించింది. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో భవనాన్ని నిర్మించి నియోజకవర్గ స్థాయిలో ప్రయోగశాలలను అందుబాటులోకి తెచ్చింది. ఒక వైపు భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టరు ఆ భవనానికి ఏర్పాటు చేసిన కిటికీలకు అద్దాలు మాత్రమే పెట్టి గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. దీనిని గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించినా అన్ సెక్యూరిటీతో(భద్రత) అధికారులు పరికరాలను అందులో ఉంచలేదు. ఫలితంగా ప్రయోగశాల ఉపయోగంలోకి రాలేదు. విత్తనాల మొలక, మందుల నాణ్యత పరీక్షించే అవకాశం లేక నియోజకవర్గంలోని జే పంగులూరు, ఇతర మండలాల్లో నకిలీ విత్తనాలను రైతులు వాడి నష్టపోతున్నారు. అయితే ఇక్కడ వెటర్నరీ ల్యాబ్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.


