వైఎస్సార్‌ సీపీ నేతలపై ఎస్సై దురుసు ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతలపై ఎస్సై దురుసు ప్రవర్తన

Mar 5 2026 7:41 AM | Updated on Mar 5 2026 7:41 AM

ఉప్పలదిన్నెలో ఏర్పాటు చేసిన సిమెంట్‌ బల్లలు తీయించేందుకు అత్యుత్సాహం

పొన్నలూరు: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తుండడంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సంఘటన పొన్నలూరు మండలం ఉప్పలదిన్నెలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు... ఉప్పలదిన్నె గ్రామం సర్వే నంబర్‌ 54/1లో కుంట పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి ఉప్పలదిన్నెకి కిలోమీటర్‌ ముందు రోడ్డు పక్కనే గ్రామానికి ప్రారంభంలో చిన్న జంక్షన్‌లా ఉంటుంది. ఇక్కడి నుంచి రావులకొల్లు, వేంపాడు తదితర గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లు ఉంటాయి. ఉప్పలదిన్నె, వేంపాడు గ్రామస్తులు కూడా ఈ జంక్షన్‌ నుంచి ఆటోలు, ఇతర వాహనాలు ఎక్కి పొన్నలూరు, కందుకూరు ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. దీంతో గతంలో దాతలు ఈ జంక్షన్‌లో బస్‌ షెల్టర్‌ నిర్మించగా, ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 15 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ జంక్షన్‌లో ప్రయాణికులు, బాటసారులు కూర్చోవడానికి గ్రామ ఉప సర్పంచ్‌ కట్టా కరుణాకర్‌ రూ.10 వేలు వెచ్చించి రెండు బల్లలు ఏర్పాటు చేశారు. ఇది మింగుడు పడని స్థానిక టీడీపీ నాయకుడు గత శుక్రవారం పంచాయతీ కార్యదర్శిని పురమాయించి బల్లలను తొలగించి పక్కన పడేశారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ మన్నెం పద్మ, ఉప సర్పంచ్‌ కట్టా కరుణాకర్‌, మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, గ్రామస్తులు కార్యదర్శిని ప్రశ్నించగా... తనపై ఒత్తిడి ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చిందంటూ సమాధానమిచ్చాడు.

మరోసారి అడ్డుకున్న పోలీసులు...

ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి ఉప సర్పంచ్‌ కట్టా కరుణాకర్‌, సర్పంచ్‌ భర్త మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, గ్రామస్తులు బల్లలను ఏర్పాటు చేయడానికి జంక్షన్‌కు వెళ్లారు. సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేసిన తర్వాత... ఎస్సై సత్యనారాయణతో స్థానిక టీడీపీ నాయకుడు మాట్లాడి వారి మీదకు ఉసిగొల్పాడు. దీంతో టీడీపీ నాయకుడు చెప్పిందే తడవుగా ఎస్సై రంగప్రవేశం చేసి సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ప్రాంతంలో బల్లలు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదని, ప్రయాణికులు, బాటసారులకు ఉపయోగపడతాయిని చెప్పినప్పటికీ ఎస్సై దురుసుగా ప్రవర్తించి... నాయకులపై చెయ్యి వేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు పదండంటూ ఓవరాక్షన్‌ చేశాడు. బల్లలు తొలగించకపోతే కేసులు పెడతామని బెదిరించాడు. పోలీసుల తీరును ప్రశ్నించిన స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు పట్ల కూడా ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. జెడ్పీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీపు ఎక్కు.. పోలీస్‌ స్టేషన్‌కు నడువంటూ హూంకరించాడు. ఎస్సై ఓవరాక్షన్‌తో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకుడు చెప్పాడంటూ ఎస్సై దురుసుగా ప్రవర్తించడం ఏమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. మొత్తంగా బల్లలు ఏర్పాటుపై టీడీపీ నాయకుడు, పోలీసుల తీరు వల్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement