● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పేదల గృహ నిర్మాణాలకు నిర్దేశించిన లేఅవుట్స్‌లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో అగ్రహారం, యరజర్ల వద్ద లే అవుట్స్‌ను వేశారని, ఈ రెండు లేఅవుట్స్‌లో అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలో నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పీపీపీ పద్ధతిలో నగర కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చేలా షాప్స్, మాల్స్ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమీక్షలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, రిజిస్ట్రేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం: జనాభా లెక్కల సేకరణ సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు సిబ్బందిని ఆదేశించారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులోని జవహర్ నవోదయ కేంద్రియ విద్యాలయలో మంగళవారం జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఎస్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జేసీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ జనాభా లెక్కల సేకరణ త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమానికి కేటాయించిన అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించి లోటుపాట్లు లేకుండా పూర్తిచేయాలన్నారు. సెన్సెస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ దఫా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టాలన్నారు. మొదటి విడతలో ఇళ్లు, రెండో విడతలో జన, కుల గణన చేపడతామన్నారు. ప్రజలే తమ వివరాలను స్వయంగా ఇంటివద్ద నుంచే నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చామన్నారు. మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఇక్కడ శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో జనాభా లెక్కల ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందికి వివరించాలన్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 497 గ్రామాల్లో జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. మే నెల 1 నుంచి 30 వ తేదీ వరకూ మొదటి విడత జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ డీసీహెచ్ ఓబులేస్, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


