రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తెలుగు తమ్ముళ్లు బియ్యం పంపిణీ చేయకుండానే థంబ్ ప్రశ్నిస్తే.. కార్డుదారునికి తప్పని తిప్పలు ప్రతి గ్రామంలో రేషన్ ఏజెంట్లు మామూళ్ల మత్తులో అధికారగణం.. విజిలెన్స్ కమిటీ ఉన్నాట్లా..? లేనట్లా...?
న్యూస్‌రీల్
ప్రతి గ్రామంలో ఏజెంటు..
రేషన్ బియ్యం అక్రమ దందాకు ఒంగోలుకు చెందిన ముఠా గ్రామ గ్రామాన ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో రేషన్ మాఫియా ముఠా లారీ వచ్చినప్పుడు దగ్గరుండి.. రేషన్ షాపులకు తిప్పడంతో పాటు.. ఆ రేషన్ షాపులో ప్రతి నెలా ఎన్ని బస్తాలు మిగులుతాయి.. మాఫియా లారీలోకి ఎన్ని బస్తాల లోడ్ ఎక్కించాడు. ఏమైనా ఇతర వ్యాపారులకు అమ్ముతున్నాడా.. ఇవన్నీ గ్రామ బియ్యం ఏజెంట్లు పర్యవేక్షించాలి. ముందుగా ఏ షాపులో ఎంత స్టాక్ ఉందనేది చెప్పడంతో పాటు లారీ లోడ్ అయ్యాక.. మండల కేంద్రం దాటేంత వరకు పర్యవేక్షించాలి. దీనికి గాను ఆ ఏజెంట్లకు కేజీకి కొంత నగదు చెల్లింపు ఉంటుంది.
అధికార పార్టీ నేతలు సంపద సృష్టిలో తలమునకలవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రేషన్ అక్రమ దందాకు అధికారిక రెక్కలు వచ్చాయి. రేషన్ షాపులను కూటమి నేతలు హస్తగతం చేసుకున్నాక రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు చేరాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి జేబులు నింపుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది.
జోరుగా దందా..
అక్రమార్కులు ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీని కూడా అక్రమ మార్గానికి వాడుకుంటున్నారు. ప్రతి నెలా 26 నుంచి 31 తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, బెడ్‌రిడెన్ పేషంట్లకు ఇంటికి పోయి నేరుగా కార్డు థంబ్ వేయించుకుని రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా మార్చుకుని.. రేషన్ డీలర్లు ముందుగానే సాధారణ రేషన్ కార్డుదారుల థంబ్‌ను కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది కార్డుదారులకు బియ్యం స్థానంలో ప్రతి కేజీకి రూ.10 నగదు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఒక్క కనిగిరి మున్సిపల్ పరిధిలో బెడ్‌రిడెన్, దివ్యాంగుల రేషన్ కార్డులు 1,500 వరకు మాత్రమే ఉంటాయి. కానీ నెలాఖరు లోపు సుమారు 4 వేలకు పైగా రేషన్ కార్డులకు బియ్యం ఇచ్చినట్లు డీలర్లు నివేదికలు ఇస్తున్నారు.
రేషన్ దందాకు
కనిగిరిరూరల్:
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థ పూర్తిగా తెలుగు తమ్ముళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఏదో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా అధికార పార్టీకి చెందిన వాళ్లే. ఎంతలా అంటే తహసీల్దార్ స్థాయి అధికారులను సైతం రేషన్ డీలర్లు బెదిరించే పరిస్థితి. అధికార పార్టీ నేతల హుకుం.. వ్యవస్థలోని లాలూచీ వారిని ఏమీ చేయలేని నిశ్చేష్టులుగా మార్చింది. గడిచిన 19 నెలలుగా అసలు రెవెన్యూ అధికారులు ఒక్క డీలర్ షాపును తనిఖీ చేసిన పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. రేషన్ డీలర్లపై అనేక ఫిర్యాదులు వస్తున్నా.. ఆర్డీఓ స్థాయి అధికారులు సైతం రేషన్ షాపుల గడప తొక్కలేదనే ఆరోపణలున్నాయి.
పంపిణీకి ముందే దోపిడీ..
జిల్లాలో సుమారు 1392 రేషన్ దుకాణాలు ఉండగా.. సుమారు 6.37 లక్షల రేషన్‌కార్డులున్నాయి. జిల్లాలో ప్రతి నెలా 10,500 మెట్రిక్ టన్నులు బియ్యం వస్తుండగా.. అందులో 45 శాతం బియ్యం అక్రమ మార్గాన తరలుతోంది. కనిగిరి నియోజకవర్గంలోని 201 షాపుల్లో సుమారు 75 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు మండల కేంద్రాల్లో ఎఫ్‌సీఐ గోడౌన్ పాయింట్లు ఉన్నాయి. కనిగిరి ఎఫ్‌సీఐ గోడౌన్ పాయింట్ నుంచి 600 టన్నుల బియ్యం, అలాగే పామూరు పాయింట్ నుంచి మూడు మండలాల రేషన్ షాపులకు 530 టన్నుల పీడీఎస్ బియ్యం పరఫరా చేస్తుండగా.. వాటిలో సింహ భాగం రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్తోంది.
కార్డుదారులతో ముందే థంబ్..
చాలా వరకు రేషన్ షాపుల్లో బియ్యానికి ముందే స్లిప్పులు ఇస్తున్నారు. ఒక కార్డుదారునికి 20 కేజీలు బియ్యం ఇవ్వాల్సి ఉంటే 10 కేజీలు మాత్రమే బియ్యం... మిగతా పది కేజీలకు కేజీ రూ.10 చొప్పున ముందే చెల్లిస్తున్నారు. అదేంటి మాకు మొత్తం బియ్యం కావాలని ఏవరైనా ప్రశ్నిస్తే.. బియ్యం పూర్తిగా రాలేదు అలా అయితే పూర్తిగా వచ్చినప్పుడు చెప్తాం.. అప్పుడు తీసుకో.. నీ థంబ్ సరిగా పడటం లేదు... తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లండనీ.. మీ అలాట్‌మెంట్ ఈ సారి మరో రేషన్ షాపునకు వచ్చిందని.. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరు దీనిపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నా డీలర్లంతా అధికార పార్టీ నేతలు కావడం, బియ్యం కార్డుదారులు ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వారు కావడంతో జంకుతున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే.
పూర్తిగా నిఘా వైఫల్యం..
గతంలో ప్రతి షాపు వద్ద నుంచి నెలాఖరులో లారీ ద్వారా ఎక్కించుకుని కనిగిరి నియోజకవర్గం మొత్తం నాలుగు రోజుల్లో బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా బయటకు తరలించే వారు. ఇటీవల కనిగిరి పట్టణంలో లారీని ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్నారు. అందులో పలు రేషన్ షాపుల బియ్యంతో పాటు.. విద్యార్థుల బియ్యం కలిపి మొత్తం 235 బస్తాలు పట్టుబడ్డాయి. అవి ఏ పాఠశాల నుంచి లిఫ్ట్ చేశారనేది ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. దీంతో రూటు మార్చిన రేషన్ మాఫియా.. వాహనాల ద్వారా ముందుగా ఒక పాయింట్‌లో మొత్తం సరుకును డంప్ చేసి.. అక్కడి నుంచి రాత్రికి రాత్రికి ఎత్తుతున్నట్లు తెలిసింది. అయితే డంపింగ్ పాయింట్లుగా ఒక చోట కాకుండా పల్లెలోని రేషన్ షాపులను, పట్టణంలోని రేషన్ షాపులను, గ్రామ శివారు ప్రాంతాల్లోని జన సంచారం లేని గృహాల వద్ద ఎంచుకుని దిగుమతి చేసుకుని రాత్రి వేళ తరలిస్తున్నారు.
రైస్ మిల్లులకే సింహభాగం..
ప్రస్తుతం ఎక్కువ రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పొదిలి, కంభం, నెల్లూరు, గిద్దలూరు రైస్ మిల్లులకు.. తక్కువ శాతం మాత్రమే పోర్టుకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కార్డుదారుడి దగ్గర డీలర్ రూ.10కి కొనుగోలు చేస్తుండగా.. డీలర్ రేషన్ ముఠాకు రూ.16 నుంచి రూ.17కు విక్రయిస్తాడు. అక్కడి నుంచి అన్ని రకాల అమ్యామ్యాలు.. ఖర్చులు మొత్తం కలిపి రూ.25 వరకు పడుతుంది. రైస్ మిల్లర్ మాఫియా దగ్గర రూ.30 నుంచి రూ.35 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పోర్టుకు తరలించే రిస్క్‌ను తగ్గించుకుని రైస్ మిల్లర్లకే ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రేషన్ అక్రమ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు కనీసం నిఘా పెట్టడం లేదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. పట్టిస్తే.. కేసులు రాయడం తప్పా.. నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అధికారిక రెక్కలు
విజిలెన్స్ కమిటీ ఉన్నట్లా..లేనట్లా.. ?
అసలు రెవెన్యూ అధికారులు ఉన్నారా.. విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణ ఉందా.. అనేది ప్రశ్నార్థకం. ప్రతి నెలా, లేదా రెండు నెలలకొకసారి జరగాల్సిన విజిలెన్స్ కమిటీ (ఆహార సలహా సంఘం) సమావేశం ఎప్పుడు జరుగుతుందో...అనేది ఎవరికి తెలియని దుస్థితి. గడిచిన రెండేళ్లలో ప్రజా సంఘాల నేతలు పట్టుకున్న బియ్యం తప్పా.. అధికారులు ఒక్క బస్తా బియ్యం పట్టుకున్న దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. పట్టణ శివారు ప్రాంతాలకు వెళ్లి ఒక్కసారి కార్డుదారులను పలకరిస్తే.. డీలర్ల బాగోతం బట్టబయలవుతుంది.
మేం ఏ బియ్యమూ పట్టుకోలేదు
రేషన్ షాపుల తనిఖీలు నిర్వహిస్తున్నాం. విజిలెన్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. గత రెండేళ్లల్లో ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్న బియ్యం తప్పా.. మరేమీ పట్టుకోలేదు. అందులోని విద్యార్థుల బియ్యం 136 బస్తాలపై విచారణ కొనసాగుతోంది.
– ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ భూపతి


