ఒంగోలు సిటీ: ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ కీర్తి అన్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఆర్. సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు నెరవేర్చకపోగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. హామీలన్నీ అమలు చేయకుంటే భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. పీఆర్‌సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని, అరియర్స్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఫియా కౌన్సిలర్ ఎం.రాఘవరావు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ప్రభుత్వం ముందుంచిన 20 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్.లక్ష్మీనారాయణ, టి.పాండురంగ స్వామి, ఐపీయూ కౌన్సిలరు పీవీ సుబ్బారావు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి బి.అశోక్‌కుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు ఏ.అమ్మయ్య, కబీర, సబ్ కమిటీ మెంబర్లు ఎం.సురేష్‌బాబు, కె.పెద్దన్న, గురులింగం, సి.సుబ్బారావు, టీఎల్ కాంతారావు, హరినాథ్ బాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.మహబూబ్‌ఖాన్, పండిత్ పరిషత్ నాయకులు సీహెచ్ కొండయ్య, సీనియర్ నాయకులు కె.వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, పి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


