ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
కొత్తపట్నం: మండలంలోని కె.పల్లెపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.55 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కొత్తపట్నం పంచాయతీకి కూడా ఇన్‌చార్జి కార్యదర్శిగా సంపత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్తపట్నం డీడీ కాలనీ శ్మశానంలో రూ.4.70 లక్షలతో ఫెన్సింగ్ రాళ్లను కాంట్రాక్టర్ జాజుల జాలరామ్ ఏర్పాటు చేశారు. ఆ బిల్లులకు సంబంధించి ఎంబుక్ చేయడానికి రూ.55 వేల లంచాన్ని పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు.. సోమవారం కే పల్లెపాలెం సచివాలయంలో ఉన్న సంపత్ కుమార్ వద్దకు వెళ్లి కాంట్రాక్టర్ జాలరామ్ రూ.55 వేల లంచం ఇస్తుండగా మాటువేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ విజయవాడలో డెంటల్ డాక్టర్ కోర్సు పూర్తి చేశాడని, 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడని తెలిపారు. తొలుత అద్దంకి నియోజకవర్గంలో పనిచేశాడని, బదిలీల్లో భాగంగా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం పంచాయతీకి వచ్చాడని వెల్లడించారు. సంపత్ కుమార్‌ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.


