నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని వినతి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి ఒక్కరికీ నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే వివిధ ప్రభుత్వ శాఖల ఖాళీలను భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ప్రోత్సహకాలు ఇచ్చి ప్రతి ఒక్కరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి 19 నెలల గడుస్తున్నా కనీసం ఒక్క హామీనైనా అమలు చేయకుండా అటకెక్కించారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యపై చర్చించాలని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో మద్యం దుకాణాలలో పనిచేసిన సిబ్బందిని, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లో రేషన్ వాహనాలకు డ్రైవర్లుగా, సహాయకులుగా పనిచేసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తొలగించారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై తక్షణమే కార్యాచరణ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కరుణానిధి, నాయకులు కొండ గోపి, వీవీఎస్ చౌదరి, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.


