మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
భూముల ధరలు భారీగా పెరగడంతో అధికారులను అడ్డంపెట్టుకుని అధికార టీడీపీ నేతలు జోరుగా భూ దందాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ భూ వ్యాపారాన్ని శాసిస్తూ తాము చెప్పిందే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో భూ ఆక్రమణలు చేసి కొందరు వ్యవసాయం చేస్తుండగా.. మరికొందరు అక్రమంగా పట్టాలు తీసుకున్నట్లు తెలిసింది. బల్లిపల్లి రెవెన్యూకు శాశ్వత వీఆర్వో లేకపోవడం, ఉన్న వీఆర్వో మూడు పంచాయతీలకు ఇన్‌చార్జి కావడంతో అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కనిగిరి పట్టణ, మండలంలో 40 రెవెన్యూ గ్రామాలు, 25 పంచాయతీలు, 20 వార్డులు, 32 సచివాలయాలు ఉండగా, 14 మంది వీఆర్వోలు మాత్రమే ఉండటం గమనార్హం. రెవెన్యూ విభాగంలో అధికారుల కొరత కూడా అక్రమార్కులకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
‘‘గ్రీన్ ఫీల్డ్ హైవే.. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్.. ట్రిపుల్ ఐటీ లాంటి కీలకమైన ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి.. ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి’’ అంటూ పచ్చ మాఫియా భూ దందాకు తెగబడుతోంది. బల్లిపల్లి పంచాయతీ పరిధిలో నిన్నమొన్నటి వరకూ ఎకరా రూ.10 లక్షలు పలకగా.. నేడు రూ.80 లక్షలకు చేరింది. ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇదే అదునుగా కూటమి పార్టీల నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి.
కనిగిరి రూరల్: కనిగిరి మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామాల్లో బల్లిపల్లి పంచాయతీ ఒకటి. దీని పరిధిలో సుమారు 6 ప్రధాన గ్రామాలు(12 విడిగ్రామాలు, కాలనీలతో కలిపి) ఉన్నాయి. బల్లిపల్లి, విశ్వనాథపురం, బాలవెంకటాపురం రెవెన్యూ గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాలకుపైగా అసైన్డ్, వాగు, గ్రేజింగ్, కొండపోరంబోకు, ఫారెస్ట్ భూములున్నాయి. అత్యధికంగా ప్రభుత్వ భూములు, సుమారు 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న రూరల్ గ్రామాల్లో పెద్ద ెపంచాయతీ ఇది. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో అక్రమార్కుల కన్ను ఈ పంచాయతీపై పడింది.
భూ మంత్రం..
అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి గతంలో చంద్రబాబు, మంత్రులు పామూరు మండలం దూబగుంటలో శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజాభీష్టం మేరకు ప్రధాన రహదారి పక్కన కనిగిరి–పామూరు ఎన్‌హెచ్ 565 రహదారి పక్కన బల్లిపల్లి పంచాయతీలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు సర్వే నంబర్ 766, 766–1లోని సుమారు 255 ఎకరాల (పోరంబోకు) భూమి కేటాయించింది. దాని పక్కనే సుమారు 15 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మించింది. తాజాగా ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సంబంధించి అధికారులు భూ పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు. అలాగే బల్లిపల్లి లోపలి గ్రామంలోని కాలనీ వద్ద నడికుడి– కాళహస్తి రైలు మార్గం పనులు చురుగ్గా సాగుతున్నాయి. పంచాయతీకి కొంత దూరంలో (సుమారు 6 కిలోమీటర్ల దూరంలో) కనిగిరి రోడ్డు వైపు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్కిల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి.
అధికారం అండగా భూ దందా...
అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి పార్టీల నేతలు భూ ఆక్రమణలు, భూ దందాకు తెరలేపారు. టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు ఇక్కడ భూ దందాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బల్లిపల్లి పంచాయతీలో అత్యధికంగా పోరంబోకు, అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ ఒక్క పంచాయతీలోనే సుమారు 4 వేలకుపైగా ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్, కొండ పోరంబోకు భూములున్నట్లు రెవెన్యూ నివేదికలున్నాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ కళాశాలకు కేటాయించిన సర్వే నంబర్ 766లో దాదాపు 450 నుంచి 500 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. ట్రిపుల్ ఐటీకి, జగనన్న లే అవుట్‌కుపోను ఇంకా 150 ఎకరాల వరకు పోరంబోకు భూమి ఉంది. ఇందులో అగ్రభాగం ప్రధాన రహదారి వైపునకున్నట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు భూ దందా షురూ చేశారు. అధికారుల అండతో కొందరు అక్రమార్కులు సుమారు రూ.కోట్ల భూమికి ఎసరు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గత తహసీల్దార్ హయంలో జగనన్న లే అవుట్‌లో ఇద్దరు టీడీపీ నేతల అండతో 12 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ఒక్కో పట్టాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణం పరిసర ప్రాంతాల్లో కొందరికి పట్టాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధికార కూటమి పార్టీలోని ఒక వర్గం రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
భారీగా పెరిగిన భూముల ధరలు...
ప్రస్తుతం బల్లిపల్లి పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. గతంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న భూములు ఎకరా రూ.పది లక్షల వరకు ఉండగా.. ప్రస్తుతం రిజిష్టర్డ్ భూమి ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ధర పలుకుతోంది. అసైన్డ్ భూములైతే సుమారు రూ.45 లక్షల వరకు ఎకరా పలుకుతున్నాయి. లోపలి ప్రాంతాల్లో భూములు ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకుపైమాటే. దీంతో ఇక్కడ భూములపై అధికార టీడీపీ నేతల కన్నుపడింది.


