వక్ఫ్ భూముల ధారాదత్తంపై ఉద్యమిస్తాం
ముస్లిం మైనార్టీలు, మసీదుల ప్రయోజనాలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం మంగళగిరిలో 71.57 ఎకరాలు అంజుమాన్ సొసైటీకి ఇచ్చేందుకు రంగం సిద్ధం చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన ముస్లిం మైనార్టీలు వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ప్రకాశం భవనం ముందు ఆందోళన
ఒంగోలు సబర్బన్: ముస్లిం మైనార్టీలకు చెందిన వక్ఫ్ భూములను చంద్రబాబు ప్రభుత్వం తమ అనుయాయులకు, బినామీలకు ధారాదత్తం చేస్తోందని వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం నాయకులు ధ్వజమెత్తారు. ఆ మేరకు సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవన్ ముందు వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ సుల్తాన్ బాషా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రకాశం భవనం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ సుల్తాన్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మైనార్టీలకు చేస్తున్న అన్యాయాలను నిలదీశారు. అనంతరం ప్రకాశం భవనం ముందు ఆందోళన చేపట్టిన మైనారిటీ నాయకులు.. చంద్రబాబు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సుల్తాన్ బాషా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వక్ఫ్ భూములపై కన్నేసిందన్నారు. తరతరాలుగా వక్ఫ్ భూములు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం, మసీదుల నిర్వహణ కోసం, ముస్లిం పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. అలాంటిది.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అంజుమాన్ సొసైటీకి కట్టబెట్టేందుకు చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డాడు. చంద్రబాబు బినామీలకు, అనుయాయులకు దోచిపెట్టడానికే వక్ఫ్ భూములపై కన్నేసిందని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ నాయకుడు, ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా మైనార్టీలు పాల్గొని వక్ఫ్ భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. వక్ఫ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి భవిష్యత్తు ముస్లిం తరాలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులకు, తమ అనుయాయులకు అమ్మకానికి పెడుతున్నారన్నారు. బినామీలకు వక్ఫ్ భూములు కట్టబెట్టడం అత్యంత దారుణమన్నారు. మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్ భూములను అంజుమాన్ సొసైటీకి అమ్మాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు మొండి ఆలోచనలతో ముందుకు పోతున్నారని, భవిష్యత్తులో ముస్లింల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులంతా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేసుకు వినతిపత్రం అందించారు. తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అయిన మార్కాపురంకు చెందిన గౌస్ మొహిద్దీన్, దర్శికి చెందిన అమాన్ బాషా, అల్లాభక్షు, ఖాశిం, రహంతుల్లా, ఒంగోలు కరీముల్లా, అబ్దుల్లా, సయ్యద్ అప్సర్, షేక్ జిలానీ బాషా, షేక్ మహబూబ్ బాషా, షేక్ మలాంగ్, ఎండీ చాంద్ బాషా, సయ్యద్ రఫి, షేక్ సమీర్, షేక్ కరీముల్లా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


