శారద శిల్పకళా మందిరంలో ఉచిత అడ్మిషన్‌ | - | Sakshi
Sakshi News home page

శారద శిల్పకళా మందిరంలో ఉచిత అడ్మిషన్‌

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

శారద శిల్పకళా మందిరంలో ఉచిత అడ్మిషన్‌ నేటి నుంచి నెమలిగుండ్ల ఆలయానికి ఆర్టీసీ సర్వీసులు నేటి నుంచి ప్రత్యేక పాలన

అద్దంకి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీ శారద శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు 4 సంవత్సరాల కోర్సును ఉచితంగా నేర్పించనున్నట్లు పట్టణానికి చెందిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరిన వారికి రాతి శిల్పకళను నేర్పుతారని తెలిపారు. ఈ శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించి, రెండో సంవత్సరం నుంచి స్టైఫండ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. కోర్సులో చేరదలుచుకున్న వారు శిల్ప కళాశాల ప్రిన్సిపాల్‌ డీ రవీంద్ర చారి, శిల్పి, శ్రీ శారద శిల్పకళామందిరం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, 8142711990, 9849211807 వారికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలోని ఉత్సాహవంతమైన యువతీ యువకులు ఈ సదవకాశం వినియోగించుకోవాలన్నారు.

మార్కాపురం టౌన్‌: రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు మార్కాపురం ఆర్టీసీ డిపో ద్వారా భక్తుల, ప్రయాణీకుల సౌకర్యార్థం 4 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ లావణ్య తెలిపారు. రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తుల కోసం ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పారు.

మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. గురువారం సాయంత్రంతో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. 2021 మార్చిలో నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. వారి పదవీ కాలం ఏప్రిల్‌ 2తో పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్‌ల స్థానంలో స్పెషల్‌ ఆఫీసర్లు గ్రామాల్లో పాలన చేయనున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, ఈఓఆర్‌డీలు, ఎంఈఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, మండల వ్యవసాయాధికారులు, మండల హార్టీకల్చర్‌ అధికారులు, మత్స్యశాఖ అధికారులను ఆయా గ్రామ పంచాయతీలకు 2, 3 పంచాయతీలను కలిపి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 924 గ్రామ పంచాయతీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ సర్పంచ్‌ల స్థానంలో స్పెషల్‌ ఆఫీసర్లు వచ్చారు. వీరందరూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 30న మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల పరిధిలో 21 మండలాల్లో 406 పంచాయతీలు ఉన్నాయి. మేజర్‌ గ్రామ పంచాయతీలకు ఈఓపీఆర్‌డీలు ఉన్నారు. స్పెషల్‌ ఆఫీసర్లు ఆయా గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్ల నిర్వహణ, వీధిలైట్లు తదితర అంశాలను పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement