రాచర్ల: రాచర్ల ఫారెస్ట్ బీట్ పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్‌లో నివాసం ఉంటున్న కటారి కృష్ణయ్య, కుంచపు సురేష్ అనే వ్యక్తులు నల్లమలలోని గూనికొండ నుంచి గుర్రాలకొండ వరకు బుధవారం నిప్పు పెట్టారు. అటవీ ప్రాంతంలోని నెమళ్లు, జింకలతోపాటు వన్యప్రాణుల ఆవాసాలకు నష్టం కలిగిస్తున్నారన్న అభియోగంపై ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, గిద్దలూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజులపాటు రిమాండ్ విధించారని ఫారెస్టు డీఆర్‌ఓ బి.వంశీకృష్ణకుమారి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మానాయక్ తెలిపారు.
● తన కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమన్న మౌలాబీ
సింగరాయకొండ: మండల కేంద్రంలోని శ్రీ చైతన్య నవోదయ స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి తౌషిక్ మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ విద్యార్థి తల్లి మౌలాబీ తన కుమారునిది ముమ్మాటికీ హత్యేనని ఇప్పటికే పలు విధాల నిరసనలు తెలిపి చివరికి బుధవారం ఆ పాఠశాల వద్ద కూర్చొని తన నిరసన తెలిపింది. దీంతో పాఠశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు గంటన్నరకు పైగా ఆమె తన నిరసన తెలపగా చివరికి ఆమె బంధువులు కారులో వచ్చి ఆమెను బతిమిలాడి అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. తన కుమారుడి మరణానికి ముమ్మాటికీ శ్రీ చైతన్య నవోదయ స్కూలు యాజమాన్యమే కారణమని తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని ఆమె రోదించటంతో పాటు స్కూలు యాజమాన్యాన్ని దుర్భాషలాడింది.
సింగరాయకొండ: మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డులో ఉన్న రాఘవయ్య కాలనీలో గత నెల 14వ తేదీ డాక్టర్ దువ్వూరి అనిల్‌కుమార్ ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న చీమకుర్తి గ్రామానికి చెందిన తన్నీరు శ్రీహరిబాబును బుధవారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 30.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 548 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వేలిముద్రలు పడకుండా హ్యాండ్ గ్లౌజ్‌లు వాడుతూ స్క్రూడ్రైవర్, రాడ్డు ఉపయోగించి చోరీలు చేశాడన్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్సై మహేంద్ర వివరించారు.
అద్దంకి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎల్‌ఐసీ ఏజెంట్ మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కొమ్మాలపాటి గోపీ నాఽథ్ (27) గేదెల మేత కోసం ఉదయాన్నే తన మోటారు సైకిల్‌పై పొలానికి వెళ్లారు. గడ్డి మోపు తీసుకుని ఇంటికి వస్తున్న సమయంలో పొలంలో వేసిన విద్యుత్ వైరు మడ్గర్‌కు తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్‌కు రాజగోపాల్ నగర్‌కు చెందిన యమునతో ఆరు నెలల క్రితం వివాహమైంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివాహమైన ఆరు నెలలకే భర్త అర్ధంతరంగా తనువు చాలించడంతో యమున కన్నీరు మున్నీరుగా విలపించింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


