● కలెక్టర్ విజయ సునీత
పెద్దదోర్నాల: జిల్లాకు తలమానికంగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలిసి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు, ఫీడర్ కెనాల్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జూన్ 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజుకు 4 మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాలన్నారు. ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన డీజిల్, గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, ప్రాజెక్టు ఈఈ అబూతాలిం, స్పెషల్ కలెక్టర్ శ్రీధరరెడ్డి, శివరామిరెడ్డి, తతదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో ప్రధానంగా నెలకొన్న రెవెన్యూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే 6 నెలలు రెవెన్యూ సమస్యలపై దృష్టిపెట్టాలని తెలిపారు. రీసర్వే జరిగే గ్రామాలకు ప్రతిరోజూ తహశీల్దార్లు వెళ్లాలన్నారు. మ్యుటేషన్లు, 22ఏ భూములు, ఇతరుల భూముల వంటి వాటిలో అధికారులకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలన్నారు. రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. జిల్లాలో వీఆర్‌ఓలు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవన్నారు. పదే పదే వచ్చే అర్జీలపై నేరుగా ఫీల్డు సర్వే చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌పై ప్రతిరోజూ రిపోర్టు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్, కనిగిరి ఇన్‌చార్జ్ ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎస్‌ఓ అంకయ్య, జిల్లాలోని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ఏర్పాటుతో విద్యుత్ సర్కిల్‌లోని వినియోగదారులకు వారి సర్వీసు నంబరుల మొదటి నంబరు 4కు బదులు 7 గా మార్చినట్లు ఏడీఈ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో సర్వీసు నంబరు ఉదాహరణకు 4222101012345 స్థానంలో 7222101012345 మార్చినట్లు తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించేటప్పుడు సర్వీసు నంబరులో మొదట 4కు బదులు 7 మొదలయ్యేలా చూసుకోవాల్సిందిగా సూచించారు.
మార్కాపురం రూరల్: జిల్లా ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించే జలజీవన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా బుధవారం మండలంలోని గొట్టిపడియ గ్రామం వద్ద రూ.1290 కోట్లతో జరుగుతున్న జలజీవన్ మిషన్ పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో శాశ్విత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన, సుజల నీటిని ఇంటింటికీ సరఫరా చేయనున్నారన్నారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సురేష్‌బాబు, ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


