రాష్ట్రాన్ని గాలికొదిలేసిన బాబు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని గాలికొదిలేసిన బాబు

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

ప్రజలకు మేలు చేయడం మాని జగన్‌పై తిట్ల దండకం అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కారుమూరి

ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వదిలేసి జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మలతో కలసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదని విమర్శించారు. పీ4 ద్వారా ఏం కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని, 18 ఏళ్లు నిండిన వారికి రూ.1500, ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టేశారని అన్నారు. పీ4 విజయవంతం అయిందని డబ్బాలు కొట్టుకుంటున్నారని, అసలు ఈ కార్యక్రమం ద్వారా ఏం చేశారో చెప్పాలన్నారు. మా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.3.33 లక్షల కోట్లు అప్పులు చేశారని, మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మీరు అంతకుమించి అప్పులు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, దాచుకో, దోచుకో, పంచుకో అన్న రీతిన పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

ఇప్పుడైనా అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి..

అమరావతి విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకం కాదని, విశాఖ అభివృద్ధికి కూడా జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ కాదనరని, గతంలో తాత్కాలిక భవనాలు కట్టి కాలక్షేపం చేశారన్నారు. ప్రస్తుతమైనా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. మా ప్రభుత్వ హయాంలో దేవాలయాలు అభివృద్ధి జరిగాయని, అలాగే కోనసీమలో రథం కాలిపోతే వెంటనే చేయించి ఇచ్చారన్నారు. సెక్యులర్‌ దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టొదన్నారు.

జగన్‌ వెంటే మేము..

‘‘మా ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎలా ఉన్నారు... ఇప్పుడు ఎలా ఉన్నారు? గిట్టుబాటు ధర అప్పటి, ఇప్పటి పరిస్థితులపై అందరూ బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, ప్రజలు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నార’’ని కారుమూరి అన్నారు. జగన్‌తో మేమున్నామంటూ పార్టీ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రైతులు, కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారన్నారు. 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణం, పోర్టులు, హార్బర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌ పరిధిలో సభ్యత్వం నమోదు విషయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు పెద్ద ఎత్తున చేపట్టారని, ఇందుకు అందర్నీ అభినందించారు. మార్కాపురం ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు ముందంజలో ఉన్నారన్నారు.

జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

ఒంగోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులతో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, రీజినల్‌ కోఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పార్టీ నిర్మాణం, కమిటీలు, పార్టీ స్థితిగతులు, రోజు వారీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై దిశనిర్దేశం చేశారు.

ఆయా కార్యక్రమాల్లో ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి, మాజీ మంత్రులు కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నారాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్‌, యర్రగొండపాలెం, దర్శి, కొండపి, ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిశీలకులు పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాదాసి వెంకయ్య, మీర్జా షంషీర్‌ అలిభేగ్‌, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కారుమూరి నాగేశ్వరరావు, పక్కన శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, సురేష్‌, మేరుగు నాగార్జున, బత్తుల, అన్నా రాంబాబు, చుండూరి రవిబాబు, దద్దాల తదితరులు

సమీక్ష సమావేశంలో పాల్గొన్న బూచేపల్లి, కారుమూరి, వెంకాయమ్మ, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement