మార్కాపురం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ అమలును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటిస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలతో మార్కాపురం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాసి, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేయడం తీవ్ర అన్యాయమని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్‌లను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం కార్మిక వర్గానికి బ్లాక్ డే అని అన్నారు. ఇప్పటి వరకూ ఉన్న కార్మిక చట్టాల రక్షణ కవచాన్ని నాలుగు లేబర్ కోడ్‌ల అమలు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛిద్రం చేస్తున్నాయని, కార్పొరేట్లకు లాభాలు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేబర్ కోడ్‌లను వెంటనే రద్దుచేయాలని, పాత కార్మిక చట్టాలను అమలుచేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం హేయమైన చర్య అన్నారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీ బాలనాగయ్య, పట్టణ కో కన్వీనరు సుబ్బరాయుడు, నాయకులు నాగరాజు బాషా, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, నాయక్, హరి, సలామ్ ఖాన్, శ్రీను, శేఖర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


