కొరిశపాడు రిజర్వాయరు నిర్వాసితులకు పరిహారం వేగవంతం చేయండి అధికారుతో కలెక్టర్ రాజాబాబు
అద్దంకి: ఈ వేసవిలో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై, కొరిశపాడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొరిశపాడు రిజర్వాయర్‌కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా తాగు నీరు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో వర్షం నీరు వృథాగా పోకుండా జల సంరక్షణ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టేలా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వేసవిలో చెరువులు, కాలువల పూడికతీత పనులు, జంగిల్ క్లియరెన్స్, లింక్ కెనాల్స్ శుభ్రం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అద్దంకి పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్సన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఎస్‌డీసీ విజయ జ్యోతి, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.


