తాడేపల్లిరూరల్: ఇద్దరి మధ్య ప్రేమ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ కుటుంబాలు పలుమార్లు ఘర్షణ పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రేమికుడు దేవిరెడ్డి శివరామిరెడ్డి (21) పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు బుధవారం మృతిచెందాడు. శివరామిరెడ్డితో ఆ యువతి బంధువులు పురుగుమందు తాగించారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన మేరకు.. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామానికి చెందిన దేవిరెడ్డి శివరామిరెడ్డి (21) కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతూ మానేసి ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. విజయవాడలో నివాసముండే అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని, అతడు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతనెల 18వ తేదీ శివారెడ్డితో ఆ విద్యార్థిని ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమె తల్లి గమనించింది. అనంతరం ఆ యువతి తల్లిదండ్రులు మీర్జాపేట వెళ్లి శివరామిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, చెంచులక్ష్మితో గొడవ పడ్డారు. శివరామిరెడ్డి ఇకమీదట ఆ అమ్మాయి జోలికి రాకుండా చూసుకుంటామంటూ నాగిరెడ్డి, గ్రామపెద్దలు వారికి చెప్పారు. 19వ తేదీ ఆ విద్యార్థిని, మరో యువకుడు ఫోన్‌చేసి శివరామిరెడ్డిని మార్కాపురం పిలిచారు. అక్కడ అతడిపై దాడిచేసి ఫోన్ లాక్కున్నారు. మీర్జాపేటలో కూడా రెండువర్గాల వారు తరచూ ఘర్షణ పడ్డారు. గత 25న ఆ విద్యార్థిని బంధువులు శివరామిరెడ్డిని దోర్నాల పిలిపించి దుర్భాషలాడి కొట్టారు. ఈ నేపథ్యంలో 30వ తేదీ ఇంట్లో నుంచి హడావిడిగా వెళ్లిన శివరామిరెడ్డి కొంతసేపటి తరువాత ఇంటికి వచ్చి పడిపోయాడు. అతడిని మార్కాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు పురుగుమందు తాగాడని చెప్పారు. దీంతో అతడిని తాడేపల్లి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శివరామిరెడ్డితో ఆ విద్యార్థిని కుటుంబసభ్యులు బలవంతంగా పురుగుమందు తాగించారని అతడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దోషుల్ని శిక్షించాలని కోరారు. తాడేపల్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.
తాడేపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి
యువతి బంధువులు పురుగుమందు తాగించారన్న మృతుడి తల్లిదండ్రులు
అంతకుముందు మార్కాపురం మీర్జాపేటలో రెండువర్గాల ఘర్షణ


