వాడ్ని బయటకు నెట్టు ! | - | Sakshi
Sakshi News home page

వాడ్ని బయటకు నెట్టు !

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

అసిస్టెంట్‌ లైన్‌మెన్‌పై విద్యుత్‌ శాఖ ఈఈ హరిబాబు చౌదరి రంకెలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు కొందరు అధికారులు కూడా రెచ్చిపోతున్నారు. ఒంగోలు విద్యుత్‌ శాఖ ఈఈ హరిబాబు చౌదరి ఒక చిరుద్యోగిపై చిందులేయడం సంచలనం సృష్టిస్తోంది. లింగంగుంట్ల మద్దిపాడు సెక్షన్‌లో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ ఒంగోలు డివిజన్‌ డీ త్రీకి బదిలీ చేశారు. ఈ మేరకు సీఎండీ చైర్మన్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కట్టా వెంకటేశ్వర్లుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఈ వెంకటేశ్వర్లు మార్చి 10వ తేదీ డీ త్రీ అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పోస్టింగు ఇవ్వాల్సిందిగా ఈఈ హరిబాబును ఆదేశించారు. అప్పటి నుంచి నేటి వరకు ఏఎల్‌ఎం వెంకటేశ్వర్లురెడ్డి పోస్టింగు కోసం ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇది జరుగుతుండగానే మద్దిపాడు సెక్షన్‌లో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న సునిల్‌ కు డిస్టిక్‌ స్టోర్స్‌కు పోస్టింగు ఆర్డర్‌ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు తనకు కూడా పోస్టింగు ఇవ్వమని అడిగేందుకు గురువారం ఈఈ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే బయట ఉన్న అటెండర్‌ నిన్ను ఈఈ గారు లోపలకు రానీయవద్దని చెప్పారని అడ్డుకున్నారు. ఈ లోపు సీసీ కెమెరాలోంచి వెంకటేశ్వర్లు రాకను గమనించిన ఈఈ హరిబాబు చౌదరి తన చాంబర్‌ నుంచి ఆగ్రహంగా బయటకు వచ్చారు. వచ్చీ రాగానే వెంకటేశ్వర్లును ఉద్దేశించి ‘‘బయటకు పో..బయటకు పో..’’ అంటూ రంకెలేశారు. వాడ్ని బయటకు నెట్టమని అటెండర్‌ను ఆదేశించారు. అంతటితో ఊరుకోకుండా ‘‘వీడ్ని సస్పెండ్‌ చేయండి’’ అంటూ హూంకరించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో చిత్రీకరిస్తుండగా అతడినుద్దేశించి ‘‘వీడియో తీస్తే ఏమవుద్ది...తీసుకో’’ అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఈఈ హరిబాబు ఎంత రెచ్చిపోతున్నప్పటికీ ఏఎల్‌ఎం వెంకటేశ్వర్లు రెడ్డి మాత్రం మౌనంగా తలవంచుకొని నిలబడ్డారు.

ముడుపులు ఇవ్వలేదన్న కోపంతోనే...

ఈఈ హరిబాబు చౌదరికి ముడుపులు ఇవ్వకుండా ఏఎల్‌ఎం వెంకటేశ్వర్లు రెడ్డి బదిలీ ఆర్డర్‌ తెచ్చుకున్నాడన్న కోపంతోనే విచక్షణ కోల్పోయి దూషణలకు పాల్పడినట్లు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. విద్యుత్‌ శాఖలో బదిలీల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఉద్యోగిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈఈ హరిబాబును సస్పెండ్‌ చేయాలి...

ఆఫీసులో అందరిముందు తనను అకారణంగా దూషించిన ఈఈ హరిబాబును ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఏఎల్‌ఎం వి.వెంకటేశ్వర్లు రెడ్డి విజ్ఞప్తి చేశారు. తోటి ఉద్యోగినన్న కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించారని, మనస్తాపంతో తానేదైనా చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇలా మరో ఉద్యోగికి జరగకుండా ఈఈపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement