2029లో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం చీమకుర్తి మండలం గంగమ్మ తల్లి తిరునాళ్లలో ఎమ్మెల్యే బూచేపల్లి, మాజీ మంత్రి మేరుగు
వైఎస్సార్‌సీపీ విద్యుత్ ప్రభపై మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పక్కన మేరుగు నాగార్జున, కారుమూరి, వెంకాయమ్మ
వైఎస్సార్ సీపీ విద్యుత్ ప్రభ దగ్గర జనసందోహం
చీమకుర్తి రూరల్: చంద్రబాబు అలవికాని అబద్ధపు హామీలు ఇచ్చి..అరకొరగా అమలు చేసి ప్రజలను మోసగించాడని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. చీమకుర్తి మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలో బుధవారం రాత్రి గంగా బాలత్రిపుర సుందరీ సమేత మోక్షరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గంగమ్మ తల్లి తిరునాళ్లలో ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాయ మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని, 2029లో చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కూటమి పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేరని, రైతన్నలు పండించిన ఏ పంటకు మద్దతు ధర ప్రకటించిన పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు రైతుల పక్షాన గిట్టుబాటు ధరల కోసం పోరాడితే అక్రమ కేసులు, అరెస్టులు, బెదిరింపులు సర్వసాధారణమైపోయాయన్నారు. మీ అక్రమ కేసులకు ఏ ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్త భయపడడని 2029లో చంద్రబాబుకి తగిన మూల్యం తప్పదన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకు పార్టీ, బూచేపల్లి కుటుంబం కూడా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న అంటేనే జనం అని, జగనన్న వెంటే జనం ఉన్నారని, 2029లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను పార్టీ చూడకుండా, మతం చూడకుండా కులం చూడకుండా చెప్పినవి, చెప్పనవి కూడా నెరవేర్చారన్నారు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ఏపంటకూ మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వంలో విఫలమైందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, దుంపా చెంచురెడ్డి, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


