● ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
ఒంగోలు సిటీ: జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2వ తేదీ గురువారం ఇంగ్లిష్ పరీక్షతో ముగిశాయి. దీంతో విద్యార్థులు సంతోషంగా కేరింతలు కొట్టారు. స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటూ సెండాఫ్ చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 165 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 28,316 మంది విద్యార్థులకు గాను, 28,150 మంది హాజరుకాగా, 166 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఫ్లయింగ్‌స్క్వాడ్, స్టేట్ ఫ్లయింగ్ స్క్వాడ్, అధికారులు మొత్తం 88 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు చెప్పారు.
బై బై.. ఇంటర్‌లో కలుద్దాం..


