పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ప్రకాశం భవన్ ముందు సోమవారం జిల్లా స్థాయి పెన్షనర్లు ధర్నా చేశారు. ఏపీఆర్‌పీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు అసోసియేషన్ అధ్యక్షుడు జి.శేషయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ ధర్నా చేపట్టడానికి గల ఉద్దేశాన్ని వివరించారు. ప్రధానంగా ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు కనీస పింఛన్ నెలకు రూ.9 వేలు ఇవ్వాలని, దాంతో పాటు డీఏ కూడా కలిపి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగులకు ప్రకటించిన ఎనిమిదో పీఆర్‌సీ రిపోర్టును తక్షణమే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలో ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్‌సీ నియమించి ఐఆర్ 30 శాతం మంజూరు చేయాలన్నారు. 1–7–2018 నుంచి నేటి వరకు పెన్షనర్లకు రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్‌సీ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2024 జూలై నుంచి రావాల్సిన కరువు భత్యాలను ప్రకటించాలని, 2024 ఆగస్టు నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వెంటనే మంజూరు చేయాలని కోరారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలన్నారు. 2018 నుంచి డీఏ బకాయిలు అందరికీ రాలేదని, అందరికీ జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్ కార్డు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలన్నారు. ధర్నా అనంతరం జేసీ కల్పనా కుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, ఏపీఆర్‌పీ గౌరవ సలహాదారు అయ్యప్పరెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పేరయ్య, నాయకులు నాగేశ్వరరావు, బి.బ్రహ్మానందరెడ్డి, ఆర్.నాగేశ్వరరావు, వెంకయ్య, అజీజ్, పోస్టల్ నుంచి కే వెంకటేశ్వరరావు, ఎస్.రంగారావు, కే వీరాస్వామిరెడ్డి, బ్యాంకుల నుంచి కే నారాయణరావు, సీబీ రావు, వీవీ రత్నం, వివిధ ప్రభుత్వ విభాగాల నాయకులు పాల్గొన్నారు.


