అధికారులా.. రాజకీయ నాయకులా.. | - | Sakshi
Sakshi News home page

అధికారులా.. రాజకీయ నాయకులా..

Jan 4 2026 11:10 AM | Updated on Jan 4 2026 11:10 AM

అధికా

అధికారులా.. రాజకీయ నాయకులా..

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇన్‌చార్జ్‌ల చుట్టూ అధికారుల చక్కర్లు డీఆర్సీ మీటింగ్‌లో టీడీపీ ఇన్‌చార్జ్‌లను ఎలా కూర్చోబెడతారు..? దర్శి, వై.పాలెంలో ప్రజాస్వామ్యం అపహాస్యం ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, ఎమ్మెల్యే తాటిపర్తి ఆగ్రహం గరం గరంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం

ఒంగోలు సిటీ: జిల్లాలోని అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే.. అధికార పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ప్రొటోకాల్‌ పాటించకుండా ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులోని పాత జెడ్పీ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ఆద్యంతం గరంగరంగా సాగింది. అధికారుల తీరు మీద జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇన్‌చార్జ్‌ల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు:

కనీసం పంచాయతీ మెంబరుగా కూడా ఎంపిక కాని వ్యక్తులను నేరుగా డీఆర్సీ మీటింగ్‌లలో పెద్దపీట వేసి గౌరవిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా స్థాయి అధికారుల తీరును అలుసుగా తీసుకున్న పంచాయతీ కార్యదర్శులు సైతం రెచ్చిపోతున్నారని, మండల అధికారులు ఎమ్మెల్యేలను కలవకుండా పార్టీ ఇన్‌చార్జ్‌ల చుట్టే ప్రదక్షిణ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో స్పీకరుకు కంప్‌లైంట్‌ చేసినా అధికారుల తీరు మారలేదన్నారు. పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రజాదర్బారుకు అధికారులు ఎలా హాజరవుతారు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎవరు పంపిణీ చేయాలని అధికారులపై ప్రశ్నలు సంధించారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక ఆపసోపాలు పడ్డారు. ఎమ్మెల్యే తాటిపర్తి వేస్తున్న ప్రశ్నలకు తమ వద్ద జవాబు లేక నీళ్లు నమిలారు. కలెక్టర్‌ పర్యటనకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎంపీడీవోలు మండల సర్వసభ్య సమావేశాలను వాయిదా వేస్తున్నారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ మాత్రం దానికి సమావేశాలు ఎందుకని దుయ్యబట్టారు. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారులు చేసే దుర్మార్గాలకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వెలిగొండ విషయంలో ప్రచార ఆర్భాటం:

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది కేవలం ప్రచారం మాత్రమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిర్వాసితుల పేర్లు నమోదు చేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో బాధితులందరినీ గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల దోర్నాల ప్రజలు భూములు కోల్పోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. టీ5 కాలువ నిర్మించకపోతే దోర్నాల, పుల్లలచెరువు రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. సుంకేసుల, గుండంచర్ల, కలనూతల గ్రామాల ప్రజలు ఖాళీ చేయకుండా ప్రాజెక్టు పూర్తి కాదని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందజేయకుండా 2026 లో వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీ5 కాలువ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయమై సమావేశంలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎమ్మెల్యే తాటిపర్తి నిలదీశారు.

పేరెంట్స్‌ మీటింగ్‌కు పిలవని ఎంఈఓలు..

యర్రగొండపాలెం నియోజకవర్గంలో నిర్వహించిన పేరెంట్స్‌ మీటింగ్‌కు జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మను, ఎమ్మెల్యే అయిన తమను ఎందుకు పిలవలేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ డీఈవో ను నిలదీశారు. యర్రగొండపాలెం ఎంఈఓను ఒకసారి సమావేశానికి పిలిపించమని డిమాండ్‌ చేశారు. ప్రొటోకాల్‌ పూర్తిగా పక్కన పెట్టేసిన ఎంఈఓలు టీడీపీ ఇన్‌చార్జ్‌లకు జీ హుజూర్‌ అంటున్నారని విమర్శించారు. ప్రొటోకాల్‌ పాటించని అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన పేరెంట్స్‌ మీటింగ్‌ కు పిలవకపోతే ఇక ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు ఎందుకని జెడ్పీ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ల చేత జెండా వందనం చేయించారని, వారికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు.

రూ.8,52,15,36,700 బడ్జెట్‌ ఆమోదం:

జెడ్పీ సమావేశంలో 2026–2027 సంవత్సరపు బడ్జెట్‌ను ఆమోదించారు. 2026–27 సంవత్సరంలో రూ.8,52,15,36,700 ఆదాయాన్ని అంచనా వేశారు. అందులో రూ.8,50,81,82,396 వ్యయాన్ని చూపించారు. రూ.1,33,54,304 ను మిగులు చూపుతూ తయారు చేసిన బడ్జెట్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ బీ చిన ఓబులేసు, బాపట్ల జిల్లా డీఆర్‌ఓ గంగాధరగౌడ్‌, జెడ్పీ సీఈఓ చిరంజీవి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

అంబులెన్స్‌ నడపలేని అసమర్ధ ప్రభుత్వం..

కొత్త జిల్లా ఏర్పాటుకు ఆహ్వానం లేదు..

ఇటీవల మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా జరిగిన ప్రభుత్వ కార్యకలాపాలకు దేనికి కూడా ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందలేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు ప్రొటోకాల్‌ పట్టదా అని నిలదీశారు. జిల్లాలోని దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తున్న అధికారుల మీద కోర్టుకు వెళతామన్నారు.

ఉల్లి రైతులకు ప్రభుత్వ సహకారం అందించాలి

వైపాలెం నియోజకవర్గంలోని నడిగడ్డలో ఉల్లి పండించే రైతుకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నడిగడ్డలో ప్రతి ఏడాది 1600 ఎకరాల వరకు ఉల్లి సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కర్నూలు ప్రాంతంలో ఉల్లి పండించే రైతులకు ఇచ్చినట్లుగానే నడిగడ్డ రైతులకు కూడా ప్రభుత్వం సహకారం అందించాలన్నారు.

రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలుట్ల పీహెచ్‌సీలో వైద్యులు ఉండటం లేదని ప్రజలు అనారోగ్యం బారిన పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నిధుల ద్వారా పీహెచ్‌సీకి తాను అంబులెన్స్‌ను మంజూరు చేయించినా డ్రైవర్‌ను నియమించకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అంబులెన్స్‌ వద్దని ఎంపీకి అధికారులు లెటర్‌ రాయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ను నడపలేని ప్రభుత్వం ఎందుకని ఎద్దేవా చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశానికి అధికార కూటమి ఎమ్మెల్యేలలో కేవలం ఒక్కరు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు నగరంలోనే ఉన్నా సమావేశం వైపు తొంగిచూడలేదు. ఎంపీ మాగుంట సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.

అధికారులా.. రాజకీయ నాయకులా..1
1/1

అధికారులా.. రాజకీయ నాయకులా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement