104 ఉద్యోగులపై వేధింపులు ఆపాలి
ఒంగోలు టౌన్: న్యాయం కోసం 104 ఉద్యోగులు రోడ్డెక్కారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 104 బాధ్యతలను చేపట్టిన భవ్య హెల్త్‌కేర్ ఏజెన్సీస్ యాజమాన్యం ఉద్యోగులను వేధిస్తోందని కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయినా అటు ప్రభుత్వం గానీ, ఇటు భవ్య యాజమాన్యం కానీ స్పందించడం లేదు. అసలు ఉద్యోగుల నిరసనను ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చిరుద్యోగులైన 104 ఉద్యోగులు అనివార్యంగా రోడ్డెక్కారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భవ్య యాజమాన్యం వేధింపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమకు సత్వరం న్యాయం చేయాలని నినదించారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థలో విధులు నిర్వహిస్తున్న డీఈఓలకు జీఓ నంబర్ 7 ప్రకారం రూ.18,500 జీతం చెల్లించాలని , క్యాజువల్ సెలవులను పునరుద్ధరించాలని, బఫర్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, యాజమాన్యం తరపున పీఎఫ్ వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కొవ్వూరి రవివర్మ, బాషా, వంశీ, రమేష్, రవి, వస్తాద్ తదితరులు పాల్గొన్నారు.


