అవినీతి సొమ్ముతో కళ్లు మూసుకున్న పచ్చనేత
యర్రగొండపాలెం: ఎటువంటి హోదా లేని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబుకు అవినీతి సొమ్ముతో కళ్లు మూసుకొనిపోయాయని, అధికారం ఉందని తన మదాన్ని ప్రదర్శిస్తున్నాడని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మండలంలోని నరసాయపాలెంలో సోమవారం రాత్రి జరిగిన యోగయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ఆయన మాట్లాడారు. గంజాయి కొట్టిన గాలి బ్యాచ్ మాట్లాడే భాషకు మించి, బాధ్యతలను విస్మరించి మాట్లాడటం ఎరిక్షన్‌బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. నీవు దద్దమ్మలా వ్యవహరించడం నియోజకవర్గ ప్రజలు గుర్తించి నిన్ను ఓడించి నీపై ఉన్న అపనమ్మకాన్ని చూపించారని, ఇంత గాలిలో కూడా గెలవలేకపోయిన ఆయన ఇకపై కూడా గెలవలేనన్న భావనతో జనాలను పీడించుకొని తింటున్నాడని మండిపడ్డారు. పేద జనాల సొత్తును పీక్కొని తింటూ వారికష్టార్జితాన్ని స్వాహా చేస్తున్నాడని ఎరిక్షన్‌బాబుపై విరుచుకుపడ్డారు. త్వరలో బిచానా ఎత్తేయటానికి సిద్ధంగా ఉన్న ఆయన తెగబడి అక్రమార్జన కోసం పాకులాడుతున్నాడన్న విషయం నియోజకవర్గం కోడై కూస్తోందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, పార్టీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, కందుల సత్యనారాయణ చౌదరి, కందూరి కాశీవిశ్వనాథ్, సూరె శ్రీనివాసులు, పబ్బిశెట్టి శ్రీను, గోళ్ల కృష్ణ, ఒంగోలు సుబ్బారెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం, రాములు నాయక్, హరి నాయక్, సురేష్ నాయక్, గాయం శివారెడ్డి, ఎం.యోగయ్య, ఎస్.వెంకటయ్య, జి.నాగార్జునరెడ్డి, కె.వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.


