పోలీసు శాఖ విభజనకు కసరత్తు
మార్కాపురం జిల్లాకు 750 నుంచి 800 వరకూ సిబ్బంది రాక ఇంటలిజెన్స్, ఏసీబీ, సీబీసీఐడీ, ఏపీఎస్‌పీ శాఖ విభాగాలకు ఏర్పాట్లు అద్దంకి, కందుకూరు ప్రకాశంలోకి.. దర్శి నుంచి పొదిలి, త్రిపురాంతకం.. మార్కాపురం పరిధిలోకి..
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో పోలీసుశాఖ విభజనకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మార్కాపురం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చడంతోపాటు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి మార్చడంతో ఆ రెండు నియోజకవర్గాల పోలీసు స్టేషన్లను ప్రకాశం జిల్లాలోకి మార్చనున్నారు. ఇక మార్కాపురం నియోజకవర్గంలోని త్రిపురాంతకం, పొదిలి పోలీసుస్టేషన్లు దర్శి డీఎస్పీ పరిధిలో ఉండగా ఈ రెండింటినీ మార్కాపురం జిల్లాకు మార్చనున్నారు. ప్రస్తుతం నూతన జిల్లాలో మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, కనిగిరి, పామూరు సర్కిల్‌లు ఉండగా మార్కాపురం, కనిగిరి సబ్‌డివిజన్లు ఉన్నాయి. కొత్తగా పొదిలి, త్రిపురాంతకం సర్కిళ్లు కూడా మార్కాపురం జిల్లాలోకి రానున్నాయి. రెండు మూడు రోజుల్లో అమరావతిలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కాపురం డివిజన్‌లో అన్నీ పోలీసుస్టేషన్లు కలిపి 300 నుంచి 350 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. ఇంకా పలు స్టేషన్‌లలో పోలీసులు, హోంగార్డుల కొరత ఉంది. నూతన జిల్లా ఏర్పాటుతో సమస్య తీరనున్నట్లు తెలుస్తోంది.
పలు విభాగాల రాక..
నూతన జిల్లాకు ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్‌పార్టీ పోలీసులతో పాటు అడ్మిన్ ఎస్పీ, పోలీసు ట్రైనింగ్ కాలేజీ, డీసీఆర్‌బీ, స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, ఏసీబీ, సీబీసీఐడీ, ఫింగర్ ప్రింట్స్ క్లూస్‌టీం, ఐటీ కోర్‌టీమ్, పోలీసు కంట్రోల్ రూం, సీసీఎస్, ట్రాఫిక్ పోలీసుస్టేషన్, మహిళా పోలీసుస్టేషన్ తదితర విభాగాలకు చెందిన 750 నుంచి 800 వరకూ సిబ్బంది రానున్నారు. వీరందరికీ మార్కాపురంలో వసతి, కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగుల బదిలీలు, ఇన్‌చార్జి అధికారుల నియామకం, సిబ్బంది క్వార్టర్స్ తదితర అంశాలపై దృష్టి సారించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎస్పీ కార్యాలయంలో గతంలో పెద్ద భవనాన్ని నిర్మించారు. అనివార్య కారణాల వలన ఆ భవనాన్ని ప్రారంభించలేదు. ఇటీవలే ఎస్పీ హర్షవర్ధనరాజు నూతన భవనంతోపాటు సిబ్బంది క్వార్టర్స్‌ను, ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేయాల్సిన భధ్రతా చర్యలను సూచించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో సీఐ సుబ్బారావు ఏర్పాట్లు చేస్తున్నారు.


