శనగకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనాలి
వ్యవసాయ శాఖ కమిషన్‌కు రైతుల మొర
మద్దిపాడు: శనగ పంటకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని పలువురు శనగ రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్‌కు విన్నవించారు. శనివారం ఆయన మండలంలోని రైతుల పరిస్థితి కనుక్కోవడానికి గుండ్లాపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వివిధ పంటలకు పెట్టే పెట్టుబడి, పంట దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులను శనగ పంట గురించి అడగడంతో గత రెండు సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధరలేక చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేసుకున్నామని తెలిపారు. శనగ పంటకు ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరకన్నా, సబ్సిడీపై ప్రభుత్వం ఇస్తున్న శనగ విత్తనాల ధర ఎక్కువగా ఉందని అన్నారు. అందువల్లే ఈ ఏడాది రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే విత్తనాలకు ఎక్కువ కొనుగోలు చేయలేదని తెలిపారు. అంతే కాకుండా గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిధిలో ఉన్న తమ గ్రామాల్లో పంటలకు నీటి వసతి కోసం ఆయిల్ ఇంజన్లు సబ్సిడీ పై ఇప్పించాలన్నారు. ప్రస్తుతం మండలానికి ఒకే ఒక డ్రోన్ ఇచ్చారని, దాని వలన రైతులకు ఉపయోగం లేదన్నారు. గ్రామానికి ఒక డ్రోన్ ఇస్తే మందుల పిచికారీకి సులువుగా ఉంటుందని చెప్పారు. వాస్తవ పరిస్థితులను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ అన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు, ఏడీఏ రమేష్, మార్క్‌ఫెడ్ డీఎం హరికృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి జీ స్వర్ణలత ఏఈఓ శేషయ్య వీఏఏలు పాల్గొన్నారు.


