అక్రమ కేసులు అన్యాయం
● అక్రమ కేసులో అరైస్టె జైలులో ఉన్న చెన్నారెడ్డికి బెయిల్ మంజూరు
గిద్దలూరు రూరల్: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. అక్రమ కేసులో అరైస్టె జైలులో ఉన్న కంభం మాజీ ఏఎంసీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డికి బుధవారం బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన్ను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో గిద్దలూరు సబ్‌జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ న్యాయం గెలిచింది..ధర్మ నిలబడింది అన్నారు. టీడీపీ నాయకుడు చెన్నకేశవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వారి మధ్య 15 అడుగుల దూరంలో మాటా మాటా ఘర్షణ తలెత్తితే చెన్నారెడ్డి..చెన్నకేశవులపై తీవ్రంగా దాడికి పాల్పడి గాయపరిచినట్లు వైద్యులతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను తయారు చేయించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులను న్యాయస్థానం నమ్మకపోవడం వల్లే బెయిల్ మంజూరైందన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులు ప్రైవేట్ కేసులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అలవాటుగా మారిందన్నారు. అక్రమ కేసులను బనాయించాలని చూస్తే ఇకపై సహించేది లేదన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని టీడీపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కక్ష పూరిత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ కన్వీనర్ మానం బాలిరెడ్డి, నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, మండల కన్వీనర్ బి.ఓబులరావు, నాయకులు బొర్రా క్రిష్ణారెడ్డి, శ్రీరంగం, సీఆర్‌ఐ మురళి, రెడ్డి భాస్కర్‌రెడ్డి, కొమరోలు జెడ్పీటీసీ వెంకటనాయుడు, అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు, బేస్తవారిపేట ఎంపీపీ ఓసూరారెడ్డి పాల్గొన్నారు.


