సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్లు కొనొద్దు
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: తక్కువ ధరకు విక్రయించే సెల్‌ఫోన్లను కొనవద్దని, తప్పనిసరి పరిస్థితిలో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాల్సి వస్తే బిల్లును పరిశీలించిన తరువాతే కొనుగోలు చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 5 విడతల్లో రికవరీ చేసిన 342 సెల్‌ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ఎక్కువ ధర కలిగిన మొబైల్ ఫోన్‌ను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్‌కు విక్రయించేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దని, అలాంటి ఫోన్లను ఎట్టి పరిస్థితిలోనూ కొనవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మొబైల్ ఫోన్లను విక్రయించడానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మారిన పరిస్థితుల్లో సెల్‌ఫోన్లు జీవితంలో భాగంగా మారాయని, వ్యక్తిగత సమాచారం, విలువైన డేటా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించుకోవాలని, బ్యాంకు లింకై న మొబైల్ నంబర్‌ను మార్చుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు మీ ఫోన్ ఇవ్వవద్దని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన మొబైల్ ఫోన్లను తీసుకొని వాడడం కూడా మంచిది కాదన్నారు. వెంటనే వాటిని స్థానిక పోలీసుస్టేషన్లో అప్పగించాలన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సియర్ వెబ్‌సెట్‌లో ఫిర్యాదు చేస్తే చాలని చెప్పారు.
రూ.50 లక్షల విలువైన ఫోన్లు అందజేత...
గత 3 నెలల కాలంలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన 342 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెప్పారు. 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,776 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్లను ట్రేస్ చేశామన్నారు. ఫోన్లను రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు.


