ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు | - | Sakshi
Sakshi News home page

ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు

Nov 23 2025 5:37 AM | Updated on Nov 23 2025 5:37 AM

ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు

ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు

రైతుల పాలిట శాపంలా మారిన చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలకు మంగళం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడ..? విత్తనాలు, ఎరువులు, యూరియా కోసం క్యూలైన్లలో నిల్చునే దుస్థితి వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి

ఒంగోలు సిటీ: ధరలు పతనమై కష్టాల్లో అన్నదాతలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనను, రైతులను పక్కన పెట్టారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది అమలు చేసినా, లబ్ధిదారుల్లో కోత పెట్టి 7 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని చెప్పారు. ఇప్పుడు రెండో విడత కింద రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద ఇస్తామన్నది ఎంత..? వాస్తవంగా ఇస్తోంది ఎంత అని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి గత ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు సాయంగా అందించిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు పెట్టుబడి సాయంలో కౌలు రైతులకు మొండిచెయ్యి చూపించి వారికి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేయడం లేదన్నారు.

ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు 53,58,366 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం చేయాల్సి ఉందన్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు 21,433 కోట్ల 46 లక్షల 40 వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సి ఉందన్నారు. వాస్తవంగా రెండు విడతల్లో 46,85,838 మంది రైతులకు తొలి విడత కింద రూ.5 వేలు, ఇప్పుడు మరో రూ.5 వేలు.. అంటే రూ.10 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చిన మొత్తం కేవలం 4,685 కోట్ల 53 లక్షల 80 వేల రూపాయలు మాత్రమేనన్నారు. రైతులకు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం రూ.16,746 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

రైతు సంక్షేమ పథకాలకు మంగళం:

చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందాల్సిన సాయం చేస్తున్నామని చెబుతూ మోసం చేస్తోందన్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధి, ఈ–క్రాప్‌ విధానం, ఇ్‌న్‌పుట్‌ సబ్సిడీ వంటి అన్ని సంక్షేమ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడి రైతుల పాలిట శాపంలా మారిందని విమర్శించారు. అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లుగానే, రైతులను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దగా చేసిందన్నారు. మిర్చి, పొగాకు, మొక్కజొన్న, అరటి, పత్తి వంటి ఏ పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడే దుస్థితి తీసుకొచ్చారన్నారు. శనగలకు మార్కెట్‌ ధర రూ.5400 ఉంటే, రైతులకు ఇచ్చే సబ్సిడీ శనగలకు 25 శాతం సబ్సిడీతో కలిపి ధర రూ.7800 అమ్మడం దారుణమన్నారు.

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా ఏటా రూ.20 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటతప్పి మోసం చేశారని విమర్శించారు. తొలిఏడాదిలో రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదని, అనర్హుల పేరుతో 7 లక్షల మందిని పక్కన పెట్టారని చెప్పారు.

జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజీలోని శనగల రైతులకు రూ.40 వేల వరకు సాయం ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. పొగాకు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని, సీఎంకు రైతులంటే ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఏనాడూ రైతులు, రైతు కూలీల పట్ల చిత్తశుద్ధి చూపించలేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌ను వెన్నుపోటు సర్కార్‌గా అభివర్ణించారు. రైతు రుణ మాఫీ విషయంలో కూడా నాడు చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో రైతు సహాయం అందించకపోవడంతో అప్పులపాలవుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement