దొంగతనం కేసులో ఏడాది జైలు
దొనకొండ: మోటార్ సైకిల్ చోరీ చేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ దర్శి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శనివారం తీర్పు చెప్పినట్లు దొనకొండ ఎస్సై టి.త్యాగరాజు తెలిపారు. దొనకొండ మండలంలోని పడమటి లక్ష్మీపురం గ్రామానికి చెందిన వల్లపునేని శివరామకృష్ణ విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసేందుకు దొనకొండలోని మన గ్రోమోర్ సెంటర్‌కు 21–11–2024 తేదీన ఏపీపీక్యూ 7685 నంబర్ గల మోటార్ సైకిల్‌పై వచ్చాడు. తన వాహనాన్ని మన గ్రోమోర్ సెంటర్ ఎదురుగా పెట్టి లోపలికి వెళ్లి పని చూసుకుని తిరిగి బయటికి వచ్చేసరికి ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో 23–11–2024 తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై కె.విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నూజెండ్ల మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఉప్పుచర్ల బాలయేసు మోటార్‌సైకిల్ దొంగలించినట్లు పోలీసులు గుర్తించి దర్శి సబ్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.చంద్రకుమారి వాదించగా జడ్జి కె.లిఖిత ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.
మహిళల హక్కులు కాలరాస్తున్న బీజేపీ
ఒంగోలు టౌన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులు కాలరాస్తోందని, ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న మహిళల హక్కులను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ముఖ్య కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కొండారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సమాజాన్ని అనాగరిక స్థితిలోకి తీసుకెళ్లే మనువాదాన్ని మహిళలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. మనువాద పాలకులు మహిళలను వంటగదికే పరిమితం చేసేందుకు, సనాతన సంప్రదాయాలతో మూఢ విశ్వాసాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెంది మహిళలు అన్నీ రంగాలలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో మహిళలను, సమాజాన్ని వెనక్కు నెట్టే మనువాద భావజాలం చాపకింద నీరులా విస్తరించడం ప్రమాదకరమన్నారు. ఈ భావజాలాన్ని బలంగా తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షర్మిల, ఆదిలక్ష్మి, కె.లక్ష్మీప్రసన్న, ఎస్కే నాగుర్ బి, ధనలక్ష్మి, పద్మ, కె.రాజేశ్వరి, పి.రత్నం తదితరులు పాల్గొన్నారు.
● స్థానికులు, పోలీసుల సాయంతో తిరిగి పాఠశాలలో అప్పగింత
సీఎస్ పురం (పామూరు): కేజీబీవీల్లో భద్రత డొల్లగా మారుతోంది. సీఎస్ పురం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం మధ్యాహ్న సమయంలో సిబ్బందికి తెలియకుండా బయటికి వెళ్లిపోయింది. స్థానికులు, పోలీసుల సాయంతో తిరిగి పాఠశాలకు చేరడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాల్లోకెళ్తే.. ఒంగోలుకు చెందిన ఓ బాలిక సీఎస్ పురం కేజీబీవీలో 9వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న సమయంలో పాఠశాల నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారి ఫోన్ తీసుకుని తమ వారికి ఫోన్‌చేసింది. గమనించిన స్థానికుడు సదరు బాలికను పాఠశాలకు పంపేందుకు యత్నించగా, పరుగులు తీసి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు విషయం తెలిపి బాలికను వెతుక్కుంటూ వెళ్లి పామూరు రోడ్డులో గుర్తించి పోలీసులకు అప్పజెప్పారు. బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చి కేజీబీవీ ఉపాధ్యాయులను పిలిపించి వారికి బాలికను అప్పగించారు. విద్యార్థినుల భద్రత పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ఇటీవల పాఠశాలలో విద్యార్థినులను ఉపాధ్యాయులు తమదైనశైలిలో తీవ్రంగా మందలించడంవల్లే సదరు బాలిక పాఠశాల నుంచి పరారై బయటకు వచ్చినట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు పోతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని, సిబ్బందిని నమ్మి పేదలు తమ పిల్లలను పాఠశాలకు పంపితే ఇలాగేనా చూసేది అని చర్చించుకుంటున్నారు.


