పార్టీ, ప్రజా సంఘాలను బలోపేతం చేయాలి
మార్కాపురం: అట్టడుగు వర్గాల సమస్యల పరిష్కారం కోసం శతాబ్ద కాలంగా రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ని, అలాగే పార్టీకి పట్టుకొమ్మలైన ప్రజా సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మార్కాపురం ప్రాంతీయ సీపీఐ వర్క్‌షాప్ శనివారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో పార్టీ సీనియర్ నాయకుడు అందె నాసరయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో ఒకప్పుడు సీపీఐ ఒక వెలుగు వెలిగిందని, మళ్లీ ఆ దిశగా ప్రజా పోరాటాలను కొనసాగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టు కోసం పార్టీ నాయకులు దివంగత పూల సుబ్బయ్య, గుజ్జుల యలమందారెడ్డి, రావుల చెంచయ్యలు అనేక దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగానే నేడు ఆచరణలోకి వచ్చిందన్నారు. సీపీఐకి ప్రజా సంఘాలైన ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఏపీ రైతు సంఘం, ఏఐటీయూసీ, మహిళా సంఘం, కౌలు రైతు తదితర సంఘాల సభ్యత్వాలను పెంపొందించుకోవాలని ఆయన కోరారు. సీపీఐ శతాబ్ది వేడుకల సభ వచ్చే డిసెంబర్ 28న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని ఈశ్వరయ్య పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 26వ తేదీన అన్నీ గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్‌కె.యాసిన్, నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్‌కె.కాశీం తదితరులు పాల్గొన్నారు.


