లేబర్ కోడ్‌లతో కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టు
లేబర్ కోడ్ ప్రతులను దహనం చేసిన కార్మిక సంఘాల నాయకులు
ఒంగోలు టౌన్: కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మిక సంఘాల నాయకులు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్‌లను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను కార్మిక సంఘాల నాయకులు దహనం చేశారు. నిరసనలో కాలం సుబ్బారావు మాట్లాడుతూ లేబర్ కోడ్‌ల వలన కార్మికుల ప్రాథమిక హక్కులు కోల్పోతారని చెప్పారు. సమ్మె హక్కును నిర్వీర్యం చేయడం, యూనియన్లు లేకుండా చేయడం కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. జీవితావసరాలను వేతనాల నుంచి మినహాయించడం, వేతనాల నిర్వచనాన్ని మార్చివేయడం దుర్మార్గమన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను యజమాని నుంచి తొలగించడం కుట్రపూరితంగా తీసుకున్న చర్యగా అభివర్ణించారు. నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల పాలిట ఉరితాడుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాటాలను, త్యాగాలను నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మికులను నయా బానిసలుగా మార్చే ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీ జిల్లా కార్యదర్శి ఎంఎస్ సాయి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు మోహన్, రమేష్, ఎస్‌డీ సర్దార్ తదితరులు ప్రసంగించగా కార్మిక సంఘాల నాయకులు బీవీ రావు, మహేష్, జీ.రమేష్, తంబి శ్రీనివాసులు, విజయమ్మ, షేక్ హుసేన్, రాములు, శేషయ్య, రాంబాబు, శ్రీరాం శ్రీనివాసరావు పాల్గొన్నారు.


