
రాత్రికి రాత్రి పెరిగిన దరఖాస్తులు
జిల్లాలో 21 బార్లకు డ్రా శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 91 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పిన ఎకై ్సజ్ అధికారులు శనివారం ఉదయం 8 గంటలకు 94 దరఖాస్తులకు డ్రా తీసిన వైనం మొక్కుబడిగా డ్రా తతంగం
ఒంగోలు టౌన్: నూతన బార్ల కోసం శుక్రవారం మధ్యాహ్నం కోసం 27 దరఖాస్తులు వచ్చాయని అధికార వర్గాలు ప్రకటించాయి. దరఖాస్తుల స్వీకరణకు ఉన్న ఐదు గంటల్లో ఏకంగా 64 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఓపెన్ కేటగిరీలో 78, గీతకార్మికుల కేటగిరీలో 13 మొత్తం కలిపి 91 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం ఉదయం 94 దరఖాస్తులకు డ్రా నిర్వహించడం గమనార్హం. ఈనెల 13వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 2025–28కి సంబంధించి కొత్తబార్ పాలసీ ప్రకటించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టింది. 26వ తేదీ నాటికి గడువు ముగుస్తుందని, 28వ తేదీ డ్రా నిర్వహిస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. ప్రభుత్వం ఆశించిన మేర దరఖాస్తులు రాలేదు. దాంతో మరో మూడు రోజుల గడువు పెంచి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయినా దరఖాస్తులు రాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు పాత వ్యాపారులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం వరకూ కేవలం 27 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సమయం ముగిసే సమయానికి ఆ సంఖ్య 91కి చేరింది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రకాశం భవనంలోని స్పందన హాలులో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు డ్రా నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో 26 బార్లు, గీత కార్మికులకు కేటాయించిన 3 బార్లకు ఒకేసారి డ్రా నిర్వహించారు. ఓపెన్ కేటగిరిలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 16 బార్లకు గాను 11 బార్లకు, మార్కాపురం 2, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు ఒక్కొక్కటి చొప్పున 18 బార్లకు డ్రా తీశారు. గీత కార్మికుల కేటగిరీలో ఒంగోలు 1, మార్కాపురం 2 బార్లకు కూడా డ్రా నిర్వహించారు. డీఆర్వో చిన ఓబులేసు చేతులమీదుగా డ్రా తీశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేర దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా డ్రా నిర్వహించామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి బార్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా మిగిలిన 8 బార్లకు గాను దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 1వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని, ఆసక్తి కలిగిన వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎకై ్సజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం కోరారు. ఈ డ్రాలో అసిస్టెంట్ కమిషనర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 94 దరఖాస్తులు వచ్చినప్పటికీ డ్రాలో పాల్గొనేందుకు వ్యాపారులు నామమాత్రంగా మాత్రమే హాజరుకావడం గమనార్హం. దాంతో డ్రా వ్యవహారం ఒక తంతులాగా సాగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.