
అనుబంధంపై గొడ్డలి వేటు
వందల ఏళ్ల నాటి రావిచెట్టు తొలగింపు
ఒంగోలు సబర్బన్: వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఆ రావిచెట్టుతో ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని అనుబంధం ఉంది. ఆ ప్రాంతంలో ఏ హిందువు ఇంట పెళ్లి జరిగినా దేవునికి పెట్టుకుని ఊరేగింపుగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి పూజలు చేసేవారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గాయత్రి మందిరం వద్ద రోడ్డు పక్కన ఉన్న ఈ రావిచెట్టును ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉందన్న సాకు చూపి నగర పాలక సంస్థ అధికారులు శనివారం వేళ్లతో సహా పెకళించారు. దీంతో విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థలు, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. లాయర్‌పేట రైతు బజారు నుంచి మంగమూరు రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ అధికారులు పనులు చేపట్టారు. ఈ రోడ్డులో అడ్డంగా ఉండటంతో పెద్ద రావి చెట్టును పెకళించి పక్కనే ఉన్న గాంధీ పార్కులో పాతారు. ఏళ్ల తరబడి ఆ రావిచెట్టుకు మొక్కులు తీర్చుకుంటూ, ప్రదక్షిణలు చేస్తూ భక్తిభావంతో పూజలు చేస్తున్న స్థానికులు చెట్టు తొలగింపుపై తీవ్ర ఆవేదన చెందారు. చెట్టును అర్ధంతరంగా తొలగించటం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని వీహెచ్‌పీ నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.