
నల్లమలలో గుండ్లకమ్మ ఉధృతి
రాచర్ల: గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో గుండ్లకమ్మ పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శనివారం నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులకు నిరాశ ఎదురైంది. దీంతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్యతో పాటు ఏఎస్సై ఆదిశేషయ్య ట్రాక్టర్లు ఏర్పాటు చేసి భక్తులను తరలించి స్వామివారి దర్శనం చేయించారు. గుండ్లకమ్మవాగు సరిసర ప్రాంతాలతో పాటు దేవస్థానం సమీపంలోని నీటి గుండం వద్ద భక్తులు స్నానాలు చేయకుండా దేవస్థానం సిబ్బందితో పాటు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
రంగస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు:
మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తొలుత దేవస్థానం అర్చకులైన అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం పాండురంగాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

నల్లమలలో గుండ్లకమ్మ ఉధృతి