కార్పొరేషన్‌ విస్మరిస్తూ! | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ విస్మరిస్తూ!

Aug 24 2025 12:04 PM | Updated on Aug 24 2025 2:22 PM

కార్పొరేషన్‌ విస్మరిస్తూ!

కార్పొరేషన్‌ విస్మరిస్తూ!

షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతివ్వని కార్పొరేషన్‌ అయినా హైదరీ క్లబ్‌ కమిటీ అడ్డగోలుగా నిర్మాణాలు వైద్యారోగ్య శాఖకు చెందిన స్థలం కబ్జా క్లబ్‌ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌, సభ్యునిగా ఎస్పీ కమిటీలో సభ్యులుగా జిల్లా అధికారులు, రిటైర్డ్‌ అధికారులు పక్కనే నిర్మాణాలు జరుగుతున్నా..పట్టించుకోని కార్పొరేషన్‌ అధికారులు నిబంధనలు అమలు చేయాల్సిన వారే తుంగలో తొక్కితే ఎలాగంటున్న ప్రజలు

ప్లానును తిరస్కరించాం

కబ్జా విస్తరిస్తూ..

నిబంధనలకు విరుద్ధంగా హైదరీక్లబ్‌ కమిటీ నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నగరంలో అత్యంత విలువైన ప్రాంతం.. ఒక పక్క పీడీసీసీ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం, మరో పక్క ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం.. వెనుకవైపు ఓల్డ్‌ రిమ్స్‌ ప్రాంగణం. ఎదురుగా ఒంగోలు హెడ్‌ పోస్టాఫీస్‌... వీటన్నింటి మధ్యలో ఒంగోలు నగర పౌరుల రిక్రియేషన్‌ కోసం ఏర్పాటు చేసిన హైదరీ క్లబ్‌. ఈ క్లబ్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకుంటూ క్లబ్‌ ప్రాంగణంలో కలుపుకుంటూపోతున్నారు నిర్వాహకులు. క్లబ్‌ కోసం గతంలో కేటాయించిన స్థలంతో పాటు చుట్టుపక్కల స్థలాలను కూడా ఇప్పటికే కలిపేసుకున్నారు. కలెక్టర్‌ ఏ తమీమ్‌ అన్సారియా నామినేటెడ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఈ హైదరీ క్లబ్‌ కమిటీకి ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మెంబర్‌గా కూడా ఉన్నారు. వీళ్లిద్దరికీ కమిటీలో ఎన్నికలు ఉండవు. వైస్‌ ప్రెసిడెంట్‌ మొదలుకుని మిగతా కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కమిటీలో కీలక వ్యక్తి మొత్తం తానై వ్యవహరిస్తూ అక్రమాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అనుమతి లేకుండానే కమర్షియల్‌ కాంప్లెక్స్‌...

క్లబ్‌కు కేటాయించిన స్థలం కాకుండా వైద్యారోగ్య శాఖకు చెందిన దాదాపు 300 గదులకుపైగా స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కమిటీ కబ్జా చేసింది. కబ్జా చేసిన స్థలంలో హైదరీ క్లబ్‌ ప్రధాన గేటుకు పడమరవైపు ఉన్న స్థలంలో రోడ్డు ముఖద్వారంగా ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని హడావిడిగా చేపట్టారు. ఆ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో క్లబ్‌ పాలకమండలి దరఖాస్తు చేసుకుంది. అందుకోసం నిబంధనల ప్రకారం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన రుసుంలు కూడా చెల్లించింది. అయితే కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం ప్లాన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్లాన్‌ను తిరస్కరించారు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలంటే ఆ స్థలాన్ని నగరపాలక సంస్థకు మార్ట్‌గేజ్‌ చేయాల్సి ఉంది. మార్ట్‌గేజ్‌ లేకుండానే ప్లాన్‌ అప్రూవల్‌ కోసం కమిటీ దరఖాస్తు చేసుకుంది. మార్ట్‌గేజ్‌ కోసం ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి కమిటీ పేరుమీద మార్ట్‌గేజ్‌ చేయాలని కోరారు. అది ప్రభుత్వ స్థలమని, హైదరీ క్లబ్‌ పేరు మీద మార్ట్‌గేజ్‌ చేయడం నిబంధనలకు విరుద్ధమని వాళ్లు కూడా తిరస్కరించారు.

కమిటీలో రిటైరైన జిల్లా స్థాయి అధికారులు...

హైదరీ క్లబ్‌ కమిటీలో రిటైరయిన జిల్లా స్థాయి అధికారులు కూడా ఉన్నారు. రెవెన్యూలో పనిచేసిన తహసీల్దార్లు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన అధికారులు కూడా పాలక మండలితో పాటు కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. వాళ్లే దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాల మీద బయటకు వచ్చి మాట్లాడే సాహసం ఎవరూ చేయలేకపోయినా ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తారా అంటూ లోలోపల మదనపడుతున్నారు. కలెక్టర్‌ ప్రెసిడెంట్‌గా ఉండే హైదరీ క్లబ్‌లోనే ఈ విధంగా జరిగితే ఇక ప్రభుత్వ నిబంధనలను, చట్టాన్ని పరిరక్షించేవారెవరంటూ నిలదీస్తున్నారు.

రిక్రియేషన్‌ను కమర్షియల్‌గా మార్చి...

హైదరీ క్లబ్‌ కోసం మొదట్లో ప్రభుత్వం కేటాయించిన స్థలం రిక్రియేషన్‌ కోసం. కానీ, ప్రస్తుత కమిటీ దానిని కమర్షియల్‌గా మార్పు చేసి అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. కమిటీ కబ్జా చేసిన స్థలాన్ని ఒక ఆదాయ వనరుగా మలచుకునే ప్రయత్నమే హడావిడిగా అక్రమంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం. క్లబ్‌ ఉండే స్థలం ప్రధాన కూడలి కావటంతో వ్యాపారానికి అనువుగా మారింది. దాంతో అడ్డగోలుగా అయినా సరే కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించి అద్దెలకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోని షాపులను ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా కాకుండా అయినవారికి కట్టబెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే షాపులను అద్దెలకు కేటాయించి రూ.లక్షల్లో అడ్వాన్స్‌లు కూడా తీసేసుకున్నట్లు సమాచారం.

హైదరీ క్లబ్‌ పాలకమండలి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాం. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కోసం చేసుకున్న ప్లాను నిబంధనల ప్రకారం లేదు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఆ స్థలాన్ని ఒంగోలు నగరపాలక సంస్థకు మార్ట్‌గేజ్‌ చేయాల్సి ఉంది. వాళ్లు సమర్పించిన ప్లాన్‌లో మార్ట్‌గేజ్‌ డాక్యుమెంట్లు లేవు. ఇంకా కొన్ని డాక్యుమెంట్లు వాళ్లు సమర్పించాల్సి ఉంది. అవేమీ లేకపోవటంతో ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వలేదు. దీనిపై అదనపు సమాచారం కావాలంటే కమిషనర్‌ వెంకటేశ్వరరావును సంప్రదించండి.

– జెడ్‌ సుధాకర్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, ఒంగోలు నగరపాలక సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement