
చిన్నారుల నటనతో ఆకట్టుకున్న తెలుగు వెలుగులు
ఒంగోలు టౌన్: పుస్తక మహోత్సవం 9వ రోజు పెదపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘తెలుగు వెలుగులు’ నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. ఒక గంట నిడివి కలిగిన ఈ నృత్య రూపకంలో తెలుగు సాహిత్య చరిత్ర సంస్కృతిని ఆవిష్కరించారు. చిన్నారులు అద్భుతమైన హావభావాలు ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థుల ప్రతిభ, కళారూపాలను ప్రదర్శించారు. మోనో యాక్షన్, మైమ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమకు ఇష్టమైన పాత్రలకు సంబంధించిన వేషధారణతో అచ్చుగుద్దినట్లుగా సంభాషణలను పలికించి ఔరా అనిపించుకున్నారు. అనంతరం మాదాల రంగారావు సాహిత్య వేదిక మీద ఏటుకూరి బలరామమూర్తి రచించిన మన చరిత్ర పుస్తకాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవిష్కరించారు. రాహుల్ సాంకృత్యాయన్ రచించిన భారత దర్శనం పుస్తకాన్ని సీపీఐ రాష్ట్ర నాయకుడు హరినాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రకాశం జిల్లా సంస్కృతి, సాహిత్యం అనే అంశం మీద చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో సినీ నటులు మాదాల రవి, ఏవీ పుల్లారావు, విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ జిల్లా నుంచి ఎందరో కళాకారులు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు. జిల్లా కళల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్ ఆలపించిన వందనం వందనం పాట విశేషంగా అలరించింది. శనివారం పుస్తక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రజల కోరిక మేరకు పుస్తక మహోత్సవం చివరి రోజున ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.